ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, శాసనసభ ఎన్నికల కోలాహలం ముగియడంతో అక్కడి కీలక నేతలంతా విదేశాల కు వెళ్లి సేద తీరుతున్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత హింస చెలరేగింది. దీంతో 144 సెక్షన్ విధించి నేతలను గృహనిర్భంధం చేయడం, హైదరాబాద్ కు తరలించడం ద్వారా పరిస్థితులు అదుపులోకి తెచ్చారు. ఈసీ సీరియస్ గా తీసుకుంది. హింసపై నియమించిన సిట్ నివేదికను ఈ రోజు డీజీపీకి అందించనుండగా నేతలు విదేశాల బాట పట్టటం చర్చానీయాంశం అయింది.
చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 16నే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ నెల 26 తర్వాత వస్తాడని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన వైద్యపరీక్షలు చేయించుకుంటారని తెలుస్తుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన భార్య భారతితో కలిసి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న కూతుళ్ల వద్దకు వెళ్లారు. వారితో కలిసి మరికొన్ని దేశాలు పర్యటిస్తారని, జూన్ 1న తిరిగివచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా అమెరికా వెళ్లారు. ఇటీవల పెళ్లైన తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కోడలితో గడిపి అక్కడే ఉన్న తల్లితో కలిసి షర్మిల జూన్ 2న వెనక్కి వస్తారని సమాచారం.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానుండడంతో అందరూ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు, ఓటముల మీద రాష్ట్ర వ్యాపితంగా బెట్టింగులు నడుస్తున్నాయి.