ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేసేందుకు మెగా కుటుంబం క్యూ కడుతోంది. ఇప్పటికే.. మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ ఇక్కడే తిష్ట వేసింది. నాగబాబు, ఆయన సతీమణి పద్మ, ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌లు నిరాటంకంగా ప్రచారం చేస్తున్నారు. మండలాల వారీగా పంచుకుని ప్రచారాన్ని దుమ్మురేపుతున్నారు. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి నాగబాబు కుమార్తె.. కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆమె శుక్రవారం నుంచి నాలుగు రోజులు ప్రచారం చేయనున్నారు.
ఇదేసమయంలో మెగా నటుడు.. ఉప్పెన సినిమా ఫేమ్.. వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారానికి రెడీ అయ్యారు. ఈయన మెగా స్టార్ చిరంజీవి సోదరికుమారుడు అన్న విషయం తెలిసిందే. అంటే పవన్‌కు స్వయానా మేనల్లుడు. ఈయన కూడా ప్రచారం ప్రారంభించారు. బుధవారం సాయంత్రం పిఠాపురానికి చేరుకున్న వైష్ణవ్ తేజ్.. పాదగయ క్షేత్రంలో పూజలు చేశారు. అక్కడి నుంచే ఆయన ప్రచారం ప్రారంబించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ అంకుల్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం.. పవన్ మావయ్య చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు కలిసి రావాలన్నారు.
నా చుట్టూ బ్లేడ్ బ్యాచ్
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాకో తిక్కుంది. దానికీ ఓ లెక్కంది. కానీ, ఇప్పుడు సరికాదు. అందుకే నేనే నిలబడ్డా. ఈ దుర్మార్గుడి(జగన్) నుంచి రాష్ట్రాన్ని.. ప్రజలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను“ అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చింది.. రాజీ పడడానికి కాదన్న పవన్.. నిలబడి పోరాడుతున్న విషయాన్ని చెప్పారు. గత పదేళ్లుగా తాను ఏమీ ఆశించకుండానే ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు.
కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నా.. పేదల ఆకలి కేకలు విన్నా కూడా.. స్వార్థం లేకుండా పనిచేసినట్టుపవన్ చెప్పుకొచ్చారు. చేతులు దులుపుకొని వెళ్లిపోనని.. గెలిచి తీరుతామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే.. తాను నిద్ర పోతానని చెప్పారు. సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నట్టు చెప్పారు. బ్లేడ్లతో ఓబ్యాచ్ తనచుట్టూ తిరుగుతోందని చెప్పారు. ఎప్పుడు ఏం జరిగినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. అయినా.. జగన్‌ను ఎదిరించేందుకు తాను సిద్ధమేనని చెప్పారు.