నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజకీయాలు అదిరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీ లో ఉన్న ఇద్దరు నాయకులు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారి కత్తులు నూరుకుంటున్నారు. దీంతో కోవూరు నియోజకవర్గం పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక, ఇదేసమయంలో నెల్లూరు మిలియనీర్‌గా పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య.. ప్రశాంతి పోటీ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య పోరు రసవత్తరంగా మారింది.
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి జయాలు, పరాజయాలు రెండూ ఉన్నాయి. నల్లపు రెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడిగా నెల్లూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి మంత్రి, తాను కూడా మంత్రిగా చేశారు. ప్రస్తుతం కాలం కలసిరాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జగన్ హయాంలో మినిస్టర్ పోస్ట్ వస్తుందనుకుంటే రెండుసార్లూ ఆయనకు నిరాశే ఎదురైంది. చివరకు చేసేదేం లేక ఈసారయినా అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకు అనుకోకుండా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యర్థి అయ్యారు. దీంతో కాస్త ఆందోళనలో ఉన్న ప్రసన్న ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ప్రశాంతి రెడ్డికి సొమ్ముకు కొదవలేదు. పైగా మూడు పార్టీల నుంచి వచ్చి.. ఇక్కడ పోటీ చేస్తున్నారు. దీంతో నల్లపరెడ్డికి ఇదే ప్రధాన చిక్కుగా మారింది. దీనికి తోడు తాజాగా వేమిరెడ్డి ప్రశాంతి వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండో భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విమర్శలు ఆయనకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయి. ప్రసన్న వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. వేమిరెడ్డి చాన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ తన వ్యక్తిగత వివరాలను బయట పెట్టలేదు. వేమిరెడ్డి ప్రశాంతి కూడా తన వివాహం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రసన్న కుమా ర్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ప్రశాంతి రెడ్డి మరింత ధైర్యంగా ప్రజల్లోకి వచ్చారు.
తన గురించి తాను చెప్పుకున్నారు. తన మొదటి భర్త ఎవరు, తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చిందనే విషయాన్ని బహిర్గతం చేశారు. విమర్శకుల నోళ్లు ఒకేసారి మూయిం చారు. దీంతో ఆమెకు కోవూరులో మరింత ప్రచారం లభించింది. వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆమె కుంగిపోకుండా ధైర్యంగా ప్రజల ముందుకొచ్చిన నేపథ్యంలో ఆమె గ్రాఫ్ మరింత పెరిగింది. మరోవైపు.. మహిళపై ఇలా ప్రసన్న నోరు చేసుకోవడంతో మహిళా సెంటిమెంటు ఓటు బ్యాంకు కూడా ఆయనకు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు.