తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు .. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన 24 గంటల్లోనే కార్యాచరణకు దిగారు. రైతుల రుణ మాఫీ సహా..గత అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 13 హామీలను ఆగస్టు 15లోగా అమలు చేస్తామని చెప్పారని.. అప్పటిలోగా అమలు చేస్తే.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు భావించి దీనిని అంగీకరిం చాలని ఆయన స్పీకర్ ప్రసాద్‌రావును కోరారు.
ఈ మేరకు హరీష్‌రావు తన లెటర్ ప్యాడ్‌పై రాజీనామా పత్రం రాసి .. స్పీకర్‌కు పంపించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. వీటిలో రైతులరుణమాఫీ కీలకమైంది. అందుకే.. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసిన రేవంత్ ప్రభుత్వం.. రైతు రుణ మాఫీని మాత్రం వెనక్కి నెట్టారు. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి.
నిజమైన రైతులను గుర్తించేందుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇంతలోనే పార్లమెంటు ఎన్ని కల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇది పూర్తికాగానే.. అమలు చేస్తామన్నారు. కానీ, దీనిని రాజకీయంగా అస్త్రం చేసుకున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం లోకి తెచ్చింది. గత వారం రోజులుగా ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తూ.. హరీష్ రావు సవాళ్లు రువ్వారు. తన పదవికి రాజీనామా చేస్తానని.. సీఎం రేవంత్ తనపదవిలో ఉంటాడో ఉండడో నిర్ణయించుకోవాలని ఆయన సవాల్ రువ్వారు.
అయితే.. ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే.. ఆయన రాజీనామా చేస్తూ.. తన లెటర్ ప్యాడ్‌పై రాసుకొచ్చారు. ఇక, దీనిని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయకుండా .. రాజకీయ డ్రామాలకు తెరదీశారని హరీష్‌రావుపై నేతలు మండిపడ్డారు. ఇదంతా కేవలం డ్రామానే అంటూ కొట్టిపారేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఇస్తేనే రాజీనామా చేసినట్టు లెక్క అని చెబుతున్నారు. చాలా కండిషన్లు పెట్టి ఆ లేఖను జర్నలిస్టులకు ఇస్తే అది రాజీనామా అవుతుందా? శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు అది కూడా తెలియదా? ఇదంతా డ్రామా అని నేతలు నిప్పులు చెరుగుతున్నారు.