తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో రత్నప్రభ తరఫున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా జగన్ పై నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ అవినీతిమయమైందని, వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందని నడ్డా దుయ్యబట్టారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయని, ఇప్పటికే 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగినా జగన్ నిమ్మకు నీరెత్తినట్టున్నారని మండిపడ్డారు. నిందితులను అరెస్ట్ చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందని, అందుకే దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయని, ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొన్ని మతాలకు చెందిన మతపెద్దలకు ప్రభుత్వం జీతాలిస్తోందని తనకు తెలిసిందని, ఇది విన్న తర్వాత ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తోందని నడ్డా అభిప్రాయపడ్డారు. బీజేపీ సెక్యులరిజానికి పెద్దపీట వేస్తోందని, అందుకే, తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఏపీలో క్రిస్టియానిటీ పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
ఏపీలో విపరీతమైన అవినీతి ఉందని, లిక్కర్, శాండ్, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయని, అయినా సీమ ప్రాంతం ఎంతగానో వెనుకబడిపోయిందని అన్నారు.