‘లెజెండ్’ సినిమా రిలీజై ఇటీవలే పదేళ్లు పూర్తయ్యాయి. అందులో విలన్ పాత్ర పోషించిన జగపతిబాబు కెరీర్‌ను ఆ సినిమాకు ముందు, ఆ సినిమా తర్వాత అని విభజించి చూడొచ్చు. హీరోగా కెరీర్‌కు తెరపడి.. వేరే తరహా పాత్రలు చేయలేక జగపతి బాబు ఖాళీ అయిపోయాడు ఒక టైంలో. ఆయన్ని ఆర్థిక సమస్యలు కూడా వెంటాడాయి. కానీ ‘లెజెండ్’లో చేసిన విలన్ పాత్రతో రాత్రికి రాత్రి బిజీ అయిపోయాడు జగపతి. ఆ సినిమా తర్వాత ఎన్నో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేశాడు. తెలుగులోనే కాక తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆయనకు అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇండియాలోనే బిజీయెస్ట్ యాక్టర్లలో ఆయన ఒకడు.
కానీ తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నా తనకు సంతృప్తి మాత్రం లేదని అంటున్నాడు జగపతి. తెర మీద తనొక ‘రిచ్ డాడ్’గా మిగిలిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘లెజెండ్’ రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. ఆ సినిమాలో తనకు అద్భుతమైన పాత్ర దక్కిందని అన్నారు. కానీ ఆ తర్వాత అలాంటి పాత్రలు తక్కువగా వచ్చాయని చెప్పారు. ‘లెజెండ్’ తర్వాత 60-70 సినిమాలకు పైగా చేసి ఉంటానని.. కానీ అందులో తనకు సంతృప్తినిచ్చిన పాత్రలు వెతికితే ఐదారుకు మించి లేవని జగపతి అన్నారు.
శ్రీమంతుడు, అరవింద సమేత, రంగస్థలం లాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు వచ్చాయని.. కానీ ఇలా సంతృప్తినిచ్చిన పాత్రలు వేళ్ల మీద లెక్కబెట్టేలా ఉన్నాయని జగపతి అన్నారు. తాను కూడా డబ్బు కోసం కొన్ని సినిమాలు చేసి తప్పు చేసి తన కెరీర్‌ను కొంచెం దెబ్బ తీసుకున్నట్లు జగపతి చెప్పారు. తనకు ఎక్కువ పారితోషకం ఇవ్వాల్సి వస్తుందని కూడా చిన్న సినిమాల్లో మంచి పాత్రలు తనకు ఇవ్వలేదని.. కానీ పాత్ర నచ్చితే పారితోషకం తగ్గించుకుని, అవసరమైతే ఏమీ తీసుకోకుండా సినిమా చేయడానికి తాను రెడీ అని ఆయనన్నారు.