టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వెలువరించిన నాలుగో అభ్యర్థుల జాబితా.. ఆ పార్టీలో మంటలు చెలరేగేలా చేసింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తమ్ముళ్లు పార్టీ జెండాలను, అధినేత చంద్రబాబు కటౌట్లను, పార్టీ గుర్తులను కూడా తగలబెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తమ్ముళ్ల నిరసనలు మిన్నంటినట్టయింది. తొలి జాబితా సమయంలోనూ పిఠాపురంలో మంటలు రేగాయి. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు.. తీవ్రస్థాయిలో ఘర్షణలు రాజుకున్నాయి.
ఇవీ మంటలు!
+ అనంతపురం అర్బన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని, బిజినెస్ మ్యాన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంతో అనంతపురం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
+ ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు భారీగా టీడీపీ సానుభూతిపరులు చేరుకుని పెద్ద ఎత్తున చంద్రబాబుని, నారా లోకేష్ ను తీవ్రంగా విమర్శించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంపై కూడా దాడి చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో కార్యాలయం గేట్లు బండరాళ్లతో పగలగొట్టి లోపల ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని రికార్డులకు నిప్పు పెట్టారు.
+ ఎన్టీఆర్, చంద్రబాబు హోర్డింగ్ లను సైతం అదే తగలబెట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకొని నిరసనను వ్యక్తం చేశారు. స్థానికులకు కష్టపడిన వారికి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో కేసులు పెట్టించుకుని ధైర్యంగా నిలబడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా కేటాయిస్తారని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు.
+ జగన్ ప్రభుత్వంలో కార్యకర్తలపై తమపై ఎన్నో కేసులు బనాయించిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదని ప్రభాకర్ చౌదరి అన్నారు. త్వరలోనే తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణలను ప్రకటిస్తానని వెల్లడించారు.
+ గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ జితేంద్ర గౌడ్ ని కాదని వైసీపీ నుంచి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం కు టిడిపి అధినేత టికెట్ ప్రకటించారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గంలో ఒకసారిగా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు గుంతకల్లు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. గతంలోచంద్రబాబుని, నారా లోకేష్ ను ఇష్టం వచ్చినట్లుగా దూషించిన వ్యక్తికి పార్టీలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించడం ఏంటని ప్రశ్నించారు.
+ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు. నాగార్జున వెంటే మేము అంటూ నియోజక వర్గ 4 మండలాల అధ్యక్షులు, నాయకులు రాజీనామాలు చేశారు. నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ కరపత్రాలను, జెండాలను తగలబెట్టారు. “కళా వద్దు నాగార్జునే ముద్దు“ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎచ్చెర్ల వదిలేసి చీపురుపల్లి వచ్చావంటూ కళా వెంకట్రావ్ పై నాగార్జున ఫైర్ అయ్యారు.