ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పొత్తులు లేకుండా నిలబడలేడని, ఆయన ఓ రాజకీయ వికలాంగుడు అని పెద్దిరెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాఫియాతో పొత్తు లేకుండా పెద్దిరెడ్డి నిలబడలేదని అచ్చెన్న దుయ్యబట్టారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓడిపోతాడని జోస్యం చెప్పారు. పెద్దిరెడ్డి సాగించిన హత్యాకాండ బాధితుల కారణంగా రాబోయే రోజుల్లో ఆయనే వికలాంగుడు అవుతాడేమో అని అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీకి సత్తా ఉంటే పొత్తులపై విషయం కక్కాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెద్దిరెడ్డి అహంకారపూరితంగా నోరు పారేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దిరెడ్డి ఎన్నో హత్యలు చేయించాడని, ఆ హత్యకు గురైన వారి కుటుంబాల చేతుల్లో ఏదో ఒక రోజు పెద్దిరెడ్డి వికలాంగుడు అవుతాడేమోనని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ విషయం ఆయన అంతరాత్మ చెబుతున్నట్లుగా అనిపిస్తోందని అచ్చెన్న చురకలంటించారు. అందుకే, తన స్థితిని చంద్రబాబుకు అంటగట్టి పెద్దిరెడ్డి నోరు పారేసుకుంటున్నాడని దుయ్యబట్టారు. రౌడీలు, మాఫియా, కళంకిత పోలీసుల పొత్తు లేకుండా పుంగనూరులో పెద్దిరెడ్డి గెలవలేడని, ఇది కొండంత సత్యం అని అన్నారు.
అందుకే, 700 మందిపై అక్రమ కేసులు బనాయించాడని, ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసం చేయించాడని ఆరోపించారు. ఎన్నికల్లో హింసకు పాల్పడి నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. పెద్దిరెడ్డికి దమ్ముంటే పొత్తులపై నరేంద్ర మోడీని విమర్శించగలరా, మోడీ రాజకీయ వికలాంగుడు అని అనగలడా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి వి చీకటి పొత్తులు కాదా? మాఫియాలు కళంకితులతోనే జగన్ పొత్తు అని ఎద్దేవా చేశారు. రావణాసురుని అంతం చేసేందుకు వానరులతో శ్రీరాముడంతటివాడే పొత్తు పెట్టుకున్నాడని గుర్తు చేశారు. వైసీపీ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజాకాంక్ష ప్రకారమే టీడీపీ పొత్తులు పెట్టుకుందని, ఇది బహిరంగ పొత్తు అని అన్నారు.