ఇపుడిదే విషయం బీజేపీలో బాగా చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్ధానం నుండి పోటీచేయాలన్నది ప్రస్తుత రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బలమైన కోరిక. ఇందులో భాగంగానే గడచిన మూడేళ్ళుగా విశాఖలోనే ఉంటున్నారు. ఇల్లు కమ్ క్యాంపు ఆఫీసును అద్దెకు తీసుకుని తన బేస్ ను ఏర్పాటుచేసుకున్నారు. విశాఖ బేస్ గా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. జిల్లాలోని పార్టీ నేతలందరినీ కలుపుకుని వెళ్ళటంతో పాటు ఎంపీ ల్యాడ్ నిధులను, ప్రభుత్వం తరపున కూడా నిధులు తెప్పించి ఖర్చులు చేస్తున్నారు.
అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమపథకాల అమలు పేరుతో జనాల్లో బాగా హడావుడి చేశారు. అలాంటిది ఎన్నికల ప్రక్రియ ఊపందుకుని, నేడో రేపో నోటిఫికేషన్ రాబోతోందనే వాతవరణం కనబడుతోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా చేతులు కలిపింది. పొత్తుల్లో సీట్ల సర్దుబాటు కూడా చేసుకున్నది. బీజేపీ పోటీచేయబోయే సీట్లివే అని, పోటీచేయబోయే అభ్యర్ధులు వీళ్ళే అని మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. టికెట్ల కోసం ఢిల్లీ స్ధాయిలో ఆశావహులు తీవ్రమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
పార్టీలో ఇంత హడావుడి జరగుతన్న సమయంలో జీవీఎల్ పేరు కూడా ఎక్కడా వినబడటంలేదు. ఇపుడీ విషయమే పార్టీ నేతల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీలో కాని పబ్లిక్ లో కాని జీవీఎల్ ఎక్కడా పెద్దగా కనబడటంలేదు. టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకంటున్నట్లు కూడా అనిపించటంలేదు. ఎందుకని జీవీఎల్ సైలెంట్ అయిపోయారనే విషయం అంతుపట్టడంలేదు. పోటీలో నుండి తనంతట తానుగా తప్పుకున్నారా ? లేకపోతే అగ్రనేతల సూచన ప్రకారమే సైడ్ అయిపోయారా అన్నది అర్ధంకావటంలేదు.
పొత్తులో బీజేపీ తరపు విశాఖ ఎంపీగా దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్ పేర్లు వినబడుతున్నాయి. మరి పోటీలో వీళ్ళలో ఒకరుంటారా లేకపోతే కొత్తగా ఇంకెవెవరైనా రేసులోకి దూసుకువస్తారా అన్నది తెలీటంలేదు. సీఎం రమేష్ లాంటి వాళ్ళు విశాఖ నుండి పోటీచేయాలని అనుకుంటున్నట్లు మీడియాతోనే చెబుతున్నారు. అలాంటిది జీవీఎల్ మాత్రం ఎక్కడా పిక్చర్లో కనబడకపోవటమే విచిత్రంగా ఉంది.