సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. చూసేందుకు పెద్దమనిషిలా.. సౌమ్యంగా ఉన్నట్లుగా కనిపించే ఆయన.. లెక్కలు తేడా వచ్చే పరిస్థితి వచ్చినంతనే ఆయనలోని మరో మనిషి నిద్ర లేస్తారు. అనూహ్యమైన వ్యాఖ్యలు చేస్తారా? ధర్మానేనా? ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. తాజాగా కడప జిల్లాకు చెందిన సుబ్బారెడ్డి అనే ఒకడు వచ్చి శ్రీకాకుళంలో భూముల్ని కబ్జా చేస్తానంటే.. దొబ్బేయ్ మని చెప్పానంటూ హాట్ వ్యాఖ్యలు చేశారు.
‘‘కడప నుంచి ఎవడో వచ్చాడు. సుబ్బారెడ్డి అంట, భూములు దొబ్బేస్తామంటున్నాడు. అసలు నిన్ను ఇక్కడకి ఎవడు రమ్మని అన్నాడు. శ్రీకాకుళం ఏమైనా నీ అబ్బగారి సొమ్ము అనుకున్నావా’’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఆయన నోటినుంచి వచ్చిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. శ్రీకాకులం పీఎన్ కాలనీలో కళింగ కోమటి సంఘం ఆత్మీయ సమావేశానికి మంత్రి ధర్మాన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని.. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్లిపోతాయన్న వ్యాఖ్యలు చేశారు.
ఇదే పరిస్థితి చోటు చేసుకుంటే.. స్థానికులు శ్రీకాకుళంలో ఉండే పరిస్థితిని కోల్పోతారని పేర్కొనటం గమనార్హం. ‘‘ఒక ప్రజాప్రతినిధి నిజాయతీగా ఉండాలి, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదు. వేరే వాళ్ల భూములను కాజేయాలని ఎప్పుడూ చూడకూడదు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదు. ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదు. ఈ విధానాన్నే నేను పాటిస్తాను. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి అంట ఒకడు వచ్చాడు, భూములు దొబ్బేస్తా అన్నాడు. అసలు నిన్ను ఎవరు శ్రీకాకుళంకి రమ్మని అన్నాడు, తంతా ఇక్కడ నుంచి దొబ్బేయి అని అన్నాను. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. ఏ పార్టీ అనేది కూడా నేను చూడను” అని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇదే సమావేశంలో ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే కేవలం భౌతికంగా కన్పించే అంశాలే కాదని.. ప్రశాంత జీవితానికి కావాల్సిన అంశాల్ని చేకూర్చటమేనని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నా.. లేకున్నా తను అందరికి స్నేహితుడిగా ఉంటానని చెప్పటం గమనార్హం. తనకు విశ్రాంతి కావాలని చెప్పినా.. ముఖ్యమంత్రి జగన్ పోటీ చేయాలని చెప్పారని.. ఆయన మాటకు కట్టుబడి ఈసారి ఎన్నికల బరిలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. ఇదే తనకు చివరి ఎన్నికలుగా ధర్మాన స్పష్టం చేశారు. ధర్మాన నోట్లో నుంచి వచ్చిన కడప సుబ్బారెడ్డి ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అయితే.. ఇక్కడ ధర్మాన వ్యాఖ్యల్ని అందరిలా చూస్తే అసలు విషయం మిస్ కావటం ఖాయం. కీలక ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. ధర్మాన స్వరం మారటం.. ఆయన నోటి నుంచి అనూహ్యమైన వ్యాఖ్యలు రావటం చూస్తే.. ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. మీడిశదేయాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఆయన వ్యాఖ్యలకు చెబుతున్న అర్థాలు ఒకలా ఉన్నా.. ఆయన ప్రసంగ వీడియోను చూస్తే మాత్రం ఆయన ఎవరినో డ్యామేజ్ చేయాలన్న ఆలోచన ఉన్నట్లుగా కనిపించదు.
తనను తాను హీరోగా ప్రొజెక్టు చేసుకోవటానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పాలి. తాను తప్పించి మరెవరూ కూడా కడప నుంచి ఒకరు వచ్చి.. తనది కడప అని చెప్పి కబ్జా పెడుతుంటే.. ఊరుకోవటమే చేస్తారని.. తాను మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు అయ్యానన్న సందేశాన్ని ఇవ్వటమే ధర్మాన అసలు లెక్కగా చెప్పాలి. ఏమైనా.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులకు వరంగా మారే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.