ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొద్ది సంవత్సరాలుగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పార్టీకి గానీ, తన లోక్ సభ సభ్యత్వానికి గానీ రఘురామ రాజీనామా చేయలేదు. ఇక, రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి తరపున నరసాపురం లోక్ సభలో నిల్చోబోతున్నానని రఘురామ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు.
ఈ సందర్భంగా జగన్ పై రఘురామ సెటైర్లు వేశారు. గజనీ వంటి మనసుతో ఉన్న జగన్ తో కలిసి తాను పనిచేయలేనని రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనపై ఎంపీల అనర్హత వేటు వేయించేందుకు మహమ్మద్ గజినీ మాదిరిగా జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆయన చురకలంటించారు. తనపై దాడి చేసినా, తనను భౌతికంగా నిర్మూలించాలని చూసినా తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేశానని రఘురామ చెప్పారు. ఇక తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని రఘురామ కోరారు.