ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అంశాన్ని ప్రధాన కథగా తీసుకుని మలచిన `రాజధాని ఫైల్స్` చిత్రం విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి అధికార పార్టీ వైసీపీకి చెందిన పిటిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు కొట్టివేసింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్లు, రికార్డ్ లు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సినిమాను విడుదల చేసుకోవచ్చని కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి.
ఏం జరిగింది?
ఏపీ రాజధాని నేపథ్యంలో `రాజధాని ఫైల్స్` చిత్రాన్ని దర్శకుడు భాను ప్రకాశ్ తెరకెక్కించగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు. అయితే… ఈ చిత్రంలో వైసీపీ పాలనను తీవ్రంగా విమర్శిస్తున్నారంటూ.. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ.. వైసీపీ నేత, ఎమ్మెల్సీ.. లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన కోర్టు.. చిత్రం ప్రదర్శనపై స్టే విధించింది.
తాజాగా శుక్రవారం ఇదే పిటిషన్పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ను దెబ్బ తీసే విధంగా సినిమా తీశారని పేర్కొన్నారు. సినిమా ప్రదర్శనపై `స్టే`ను కొనసాగించాలని కోరారు. అయితే, సెన్సార్ సర్టిఫికెట్ సహా రికార్డులను పరిశీలించిన కోర్టు.. స్టే కొనసాగించేందుకు తిరస్కరించింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.