మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
తెలంగాణలోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానిగా పనిచేశారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణల గురించి ఇప్పటికీ చెప్తుంటారు.
అలాగే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలోనూ పీవీ నరసింహరావే ప్రధానిగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలలోని బ్రాహ్మణులలో పీవీ నరసింహరావు అంటే ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణులు 4 శాతం వరకు ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో బ్రాహ్మణుల కోసం భారీ ఖర్చుతో బ్రాహ్మణ సదన్ నిర్మించి ప్రారంభించారు.
అర్చకులు, వైదికులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన డబుల్ చేశారు.
దాంతో చాలావరకు బ్రాహ్మణులలో కేసీఆర్ పట్ల సానుకూలత ఉండేది. కేసీఆర్ నోటికి పదును ఎక్కువే అయినా బ్రాహ్మణుల గురించి మాట్లాడేటప్పుడు, ఆ వర్గానికి చెందినవారితో మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించేవారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన మంత్రివర్గంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు స్థానమిచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబును తన వెంట దావోస్ పర్యటనకు తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయనకు మంచి ప్రాధాన్యమిస్తున్నారు.
ఇవన్నీ రానున్న లోక్ సభ ఎన్నికలలో బ్రాహ్మణ ఓటర్లు, కోర్ హిందూ వర్గాలను ఆకట్టుకోవడానికే అనే వాదన ఒకటి ఉంది.
నిజానికి తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ చాలా జోరు మీదున్నప్పటికీ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి మార్చిన తరువాత స్పీడు తగ్గిపోయింది. అదే సమయంలో ఆ వేక్యూమ్ ను రేవంత్ కరెక్టుగా వాడుకుని కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారు.
దీంతో రానున్న లోక్ సభ ఎన్నికలలో కూడా ఎక్కువ సీట్లు సంపాదించడానికి ఆయన వ్యూహాలు పన్నుతున్నారు.
ఆ క్రమంలోనే బీజేపీ ఓట్ బ్యాంకు తమ వైపు తిప్పుకొనే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు.
కానీ.. ఇప్పుడు పీవీ నరసిహరావుకు భారత రత్న ప్రకటించడం ద్వారా మోదీ తెలంగాణలో బ్రాహ్మణ, కోర్ హిందూ ఓటర్లను ఆలోచించేలా చేశారు.
ఇటీవలే అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా హిందువుల మన్ననలు పొందిన మోదీ ఇప్పుడు పీవీకి భారత రత్న ప్రకటించి తెలంగాణతో పాటు దక్షిణాదిన ఉన్న బ్రాహ్మణులను ఆకట్టుకున్నారు.
పీవీది పాత కరీంనగర్ జిల్లాలోని మంథని ప్రాంతం. ఆయన తెలంగాణ ప్రాంతంతో పాటు రాయలసీమలోని నంద్యాల, ఒడిశాలోని బరంపురం నుంచి ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.
ఈ రకంగా తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాలలోనూ పీవీ ప్రభావం ఉంది. పీవీకి భారతరత్న ప్రకటించడంతో హైదరాబాద్ లోని అర్బన్ లోక్ సభ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలలో బీజేపీ పట్ల సానుకూల ప్రభావం వచ్చే అవకాశాలున్నాయి.
మొత్తానికి మోదీ ఎవరూ ఊహించని నిర్ణయంతో విపక్షాలకు షాకిచ్చారు.