ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
గురువారం ఉదయం 9 గంటల 8 నిమిషాల సమయంలో శాసనసభలో కేవలం ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారని… అందుకే ఇంకా సభ మొదలు కాలేదంటూ అచ్చెన్నాయుడు ఒక వీడియో రిలీజ్ చేశారు.
సభ ప్రారంభమవుతున్నట్లు ఇంకా బెల్ కూడా కొట్టలేదని ఆయన చెప్పారు.
టీడీపీ సభ్యులంతా 8 గంటల 55 నిమిషాలకే చేరుకున్నామని.. 9 గంటల 10 నిమిషాలు అవుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు రాలేదని ఆయన చెప్పారు.
అసెంబ్లీ హాల్ తలుపు దగ్గర నుంచి తీసిన ఆ వీడియోలో లోపల వాచీలో సమయం 9.08 గంటలు చూపించడం కనిపించింది.
ఆ సమయంలో అచ్చెన్నాయుడితో పాటు మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉన్నారు.
ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీపై గౌరవంతో తామంతా 5 నిమిషాల ముందే చేరుకున్నామని.. వైసీపీ సభ్యులు రాకపోవడంతో సభ మొదలుకాలేదని వారు చెప్పారు.
జగన్ పై నమ్మకం పోవడం, గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో ఆసక్తి చచ్చిపోయి వైసీపీ ఎమ్మెల్యేలు రావడం లేదని అంటున్నారు.
బుధవారం కూడా సభలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. సభలో బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ, జగన్ మాట్లాడినప్పుడు కానీ వైసీపీ సభ్యులు డల్ గా కనిపించారు. ఏదో వచ్చాం అన్నట్లుగా ఉన్నారే కానీ వారి ముఖాల్లో ఏమాత్రం ఉత్సాహం లేదు.
ఇదంతా జగన్ నాయకత్వంపై వైసీపీ ఎమ్మెల్యేలలో విశ్వాసం పోయిందనడానికి ఉదాహరణగా చెప్తున్నారు.