ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ పాలక వైసీపీలో ఓటమి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకప్పటి ఉత్సాహం, ఊపు ఏమీ కనిపించడం లేదు.
సీఎం జగన్ సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హడావుడి ఏమీ చేయలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ సభ్యుల హాజరు కూడా బాగా తక్కువగా ఉంది.
వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఒకప్పటిలా దూకుడు చూపడం కానీ.. జగన్ మాట్లాడుతుంటే బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేయడం కానీ పెద్దగా చేయలేదు.
ఎందుకో చాలామందిలో ఒకరకమైన నిస్తేజం కనిపించింది. కొందరికి టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడం.. ఇంకొందరికి టికెట్లు రావన్న సంకేతాలు అందడం.. ఓవరాల్ గా పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగులేదన్న అంచనాలు ఉండడం వంటివన్నీ ఈ నిస్తేజానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
బుగ్గన బడ్జెట్ ప్రసంగం సమయంలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు నిరాసక్తంగా కనిపించారు. బుగ్గన తన ప్రసంగంలో రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడు కానీ.. అంబేడ్కర్ ప్రస్తావన వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యేల నుంచి స్పందన లేదు.
నియోజకవర్గ ఇంచార్జిల పేరుతో జగన్ ఇప్పటికే ఆరు విడతలుగా అభ్యర్థులను ప్రకటించారు. కొన్ని చోట్ల సిటింగులను అసలే టికెట్లు రాకపోగా… మరికొన్ని చోట్ల సిటింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీచేయాలని జగన్ ఆదేశిస్తున్నారు.
ఇక మరికొందరికి నియోజకవర్గాలు మారుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పైగా టీడీపీ, జనసేనలు రోజురోజుకీ బలపడుతుండడం కూడా ఎమ్మెల్యేలను కలవరపెడుతోంది.
ఇవన్నీ కలిసి వైసీపీ నేతల ముఖాలు కళ తప్పాయంటున్నారు.