టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ వస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. బుధవారం రాత్రికే ఇద్దరి మధ్య భేటీ ఉండొచ్చని దిల్లీ వర్గాల సమాచారం. అయితే, అమిత్ షా షెడ్యూల్ లో ఏమైనా మార్పులున్న పక్షంలో భేటీ గురువారం ఉంటుందని లేదంటే బుధవారం రాత్రే ఇద్దరూ సమావేశమవుతారని సమాచారం.
లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 15 తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ముందే ఇప్పుడు బీజేపీ, టీడీపీ పొత్తు దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించగా.. వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే ప్రశ్న అందరిలో ఉంది. చంద్రబాబు, అమిత్ షా చర్చల తరువాత ఆ ప్రశ్నకు సమాధానం దొరకనుంది.
బీజేపీ నేతల నుంచి అందిన పిలుపు మేరకే చంద్రబాబు దిల్లీ వస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నయి. ఈ నెల 16 నుంచి దిల్లీలో మూడు రోజుల పాటు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది. అంతకంటే ముందే చంద్రబాబుతో అమిత్ షా చర్చలు జరుపుతుండడం కీలక పరిణామం.
ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ గుంభనంగా వ్యవహరిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడానికి ముందు ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న సమయంలో లోకేశ్ రెండు సార్లు అమిత్ షాతో చర్చలు జరిపారు. ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి అమిత్‌షాను లోకేష్ కలిశారు. ఆ సమయంలోనే బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులు, కేసుల గురించి వివరించినట్టు పేర్కొన్నారు. లోకేష్ భేటీలో పొత్తుల ప్రస్తావన లేదని పార్టీ వర్గాలు అప్పట్లో చెప్పాయి. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, ఏపీలో ఉన్న ఎన్నికల వాతావరణం నేపథ్యంలో బీజేపీ రాజకీయంగా తమకు కలిగే ప్రయోజనాలపై సమీక్షించుకుంటోంది.
మరోవైపు ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని పురందేశ్వరి చేపట్టాక పరిస్థితి మారింది. టీడీపీతో పొత్తు విషయంలో పురందేశ్వరి కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు అమిత్‌షా నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది. నేటి భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఫిబ్రవరి 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2014లో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు కూడా ఏపీలో బీజేపీ అడిగినన్ని ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.