టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. చిరు నటుడిగా ఇండస్ట్రీలో తన ప్రస్థానం ప్రారంభించిన చిరంజీవి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు.
ఈ క్రమంలోనే స్వయంకృషితో సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది. చిరుతో పాటు మరో తెలుగు తేజం, రాజకీయాలలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కు గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా వారిలో ఇద్దరు తెలుగువారే కావడం విశేషం. 2024 మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
పద్మవిభూషణ్ అవార్డుల జాబితా ఇదే..
1. వైజయంతిమాల బాలి (కళలు) – తమిళనాడు
2. కొణిదెల చిరంజీవి (కళలు) – ఆంధ్రప్రదేశ్
3. ఎం. వెంకయ్య నాయుడు (ప్రజా సంబంధాలు) – ఆంధ్రప్రదేశ్
4. బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ) (మరణానంతరం) – బీహార్
5. పద్మాసుబ్రహ్మణ్యం (కళలు) – తమిళనాడు
ఇక, పద్మభూషణ్ కేటగిరీలో తెలుగువారు లేరు. తెలంగాణకు చెందిన ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మ శ్రీ దక్కింది. ఏపీ నుంచి ప్రముఖ హరికథా కళాకారిణి డి.ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు దక్కింది. తెలంగాణలోని జనగాంకు చెందిన గడ్డం సమ్మయ్య(చిందు యక్షగానం కళాకారుడు), నారాయణపేట్ జిల్లా దామెరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప(బుర్రవీణ కళాకారుడు), తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలను సమకూర్చిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, బంజారా జాతి జాగృతం కోసం కృషి చేస్తున్న కేతావత్ సోమ్లాల్, యాదాద్రి సహా పలు ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ స్థపతి వేలు ఆనందాచారికి పద్మ శ్రీ దక్కింది.
ఇక, దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించినందుకు తనకు ఎలా స్పందించాలో తెలియడం లేదని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని, చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు, లక్షలాదిమంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేడు తాను ఈ స్థితిలో ఉన్నానని, తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనని పేర్కొన్నారు. ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని చిరు ఎమోషనల్ అయ్యారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.