వైసీపీ కీలక నాయకుడు, సీఎం జగన్కు స్వయానా బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజీనామా చేయడం ఎంత సేపు“ అని అన్నారు. కొన్నాళ్లుగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాను చెప్పిన వారికి లేదా తాను కోరిన వారికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని.. తన నియోజకవర్గంలో అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని.. 25 వేల మందికి పట్టాలు ఇస్తామన్న తన హామీని కూడా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన కినుక వహించిన విషయం తెలిసిందే.
దీనికి తోడుతనను మంత్రిగా తొలగించడం.. కనీసం ప్రాధాన్యం లేకుండా చేయడం కూడా మాజీ మంత్రి బాలినేనికి ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ.. ఆయన వేచి చూస్తున్నారు. ముఖ్యంగా 2019 తర్వాత.. ఆయన టీడీపీ నుంచి తీసుకువచ్చిన మాజీ మంత్రి, టీడీపీ అప్పటినే శిద్దా రాఘవరావుకు వైసీపీ టికెట్ నిరాకరించింది. అదేవిధంగా ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి బాలినేనే తీసుకువచ్చారు. ఆయనకు అప్పట్లో టికెట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం ఇచ్చేది లేదని వైసీపీ తెగేసి చెబుతోంది. ఇది మరింతగా బాలినేనికి ఇబ్బందిగా మారింది. తాను తెచ్చిన వారికి టికెట్ లు లేకుండా చేయడం ఏంటనేది ఆయన ప్రశ్న.
ఈనేపథ్యంలోనే ఆయన కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన బాలినేని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను చెప్పినవారికి టికెట్లు ఇవ్వలేదు.. సంతనూతలపాడు, కొండెపి టికెట్లు..
నాకు చెప్పకుండానే ఇచ్చారు. అసంతృప్తితో రాజీనామా చేయడం ఎంతోసేపు పట్టదు, సమస్యలన్నీ సామరస్యంగానే పరిష్కారమవుతాయి. వైసీపీ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారు. ఎర్రగొండపాలెం అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత నాది, ఒంగోలులో మాగుంటను వదులుకోవడం ఇష్టంలేదు. ఎంపీ మాగుంటను వైసీపీ నుంచే పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నాం“ అని అన్నారు.
ఇదిలావుంటే, తాను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని బాలినేని చెప్పారు. అయితే.. తన ప్రయత్నం మాత్రం(తన వారికి టికెట్లు ఇప్పించుకోవడం) ఆగబోదని, ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలన్నారు. ఎర్రగొండపాలెంలో వైసీపీ ప్రకటించిన అభ్యర్థి ప్రస్తుత మంత్రి సురేష్ మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే.. వైసీపీ అధిష్టానం పార్టీని అంటిపెట్టుకున్న తమ వంటివారిని ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని బాలినేని ముక్తాయించడం గమనార్హం.