బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైనం తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. వీరంతా త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని, అందుకే రేవంత్ ను కలిశారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు స్పందించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను చర్చించేందుకే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉంటుందని క్లారిటీనిచ్చారు.
రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అని, తమ నియోజకవర్గంలోని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలని ఆయనను కలిశానని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీఎంని కలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎండ్రకాయల పార్టీ అని, తెలంగాణ ఉద్యమం తొలి రోజు నుంచి చురుగ్గా ఉన్న తాను కాంగ్రెస్ లోకి ఎందుకు పోతానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి వెళ్లే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని క్లారిటీనిచ్చారు.
ఇక, సీఎం రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో ఇంకో వంద సార్లు కలుస్తామని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎంను కలవడంలో తప్పేముందని? నియోజకవర్గ ప్రతినిధులుగా ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. అంతమాత్రానికి పార్టీ మారుతున్నామని దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ ను వీడబోనని, కేసీఆర్ వెంట నడుస్తానని మహిపాల్ రెడ్డి చెప్పారు.
తాను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలో అని, చనిపోయే వరకు పార్టీలోనే కొనసాగుతానని మాణిక్ రావు స్పష్టం చేశారు. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పనుల కోసం రేవంత్ రెడ్డిని కలిశానని, జహీరాబాద్ ప్రజలకు ప్రతినిధిగా ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించడం తన బాధ్యత అని అన్నారు.