అంగన్వాడీల సమ్మెపై ప్రయోగించిన ఎస్మా చట్టం గడువు ముగియడంతో వారిపై జగన్ సర్కార్ కఠిన చర్యలకు దిగింది. అంగన్వాడీలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జగన్ హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణమని మండిపడ్డారు.
కక్ష సాధింపు పద్ధతులను అంగన్వాడీలపైనా వైసీపీ ప్రయోగించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని దుయ్యబట్టారు. నిరసనలను అణచివేయడం, అనైతిక పద్ధతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడంపై పెట్టిన ఫోకస్..ఆ సమస్య పరిష్కారంపై పెడితే ఫలితం వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కనబెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడు ప్రతాపం చూపిస్తున్నాడని జగన్ పై లోకేష్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో జగన్ కు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. దీంతో, జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని చురకలంటించారు.
“జగన్ అరాచక పాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్ట్రేషన్ తో ఆయన పిచ్చి పీక్ స్టేజికి చేరింది. పిచ్చివాడి చేతిలో రాయి అటు, ఇటు తిరిగి… తమ న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్ వాడీల వైపు మళ్లింది. అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోంది.’’ అంటూ లోకేష్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను, టీడీపీ-జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.