జనవరి 22న అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయవేత్త, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కు కూడా రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21వ తేదీ సాయంత్రం చంద్రబాబు అయోధ్యకు వెళ్లబోతున్నారు.
ఈ నెల 22న జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని తరించబోతున్నారు. ఆ కార్యక్రమానికి రావాలని కోరుతూ చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు 2 రోజుల క్రితం ఆహ్వానం అందించారు. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నభూతో న భవిష్యత్ అన్నరీతిలో జరగనుంది. నిన్న గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు. ఈ కార్యక్రమానికి 8 వేల మంది ప్రముఖులు రాబోతున్నారు. అందులో చంద్రబాబు కూడా ఒకరు. చంద్రబాబుకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.