సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కారును కూల్చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోని కోవర్టులతో కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందన్న బండి.. ఈ సందర్భంగా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నట్లుగా ఆరోపించారు. గత ఎన్నికల్లోనే వారికి కేసీఆర్ నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినట్లుగా పేర్కొనటం గమనార్హం.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు టచ్ లో ఉన్నారని.. వారితో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయటానికి స్కెచ్ వేస్తున్నట్లుగా బండి ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చేసి.. ఆ నిందను బీజేపీ మీద వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న బండి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఈ సందర్భంగా ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించి.. వాటిపై కౌంటర్లు సంధించారు. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమన్న మాటలకు కౌంటర్ ఇస్తూ.. పంచొద్దని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలను కూడా తీసుకురానోడు..వేములవాడ రాజన్నకు.. కొండగట్టుకు.. ధర్మపురి ఆలయాలకు నిధులు ఇస్తామని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.
గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన బండి సంజయ్.. కాంగ్రెస్ నేతల్ని చూస్తే జాలేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల బతుకుల్ని నాశనం చేసిన బీఆర్ఎస్ ను పూర్తిగా బొంద పెట్టే వరకు నిద్రపోనన్న బండి సంజయ్.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేరాలంటే కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువ గా గెలవాలని వ్యాఖ్యానించటం గమనార్హం. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కారు కూల్చేందుకు కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించాల్సింది పోయి.. బీజేపీ ఎంపీ బండి హెచ్చరించటం ఆసక్తికర రాజకీయ పరిణామంగా అభివర్ణిస్తున్నారు.