రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసిన కోనసీమ అల్లర్ల కేసులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గత డిసెంబరులోనే జీవో జారీ చేసింది. అయితే.. ఈ విషయం అత్యంత సున్నితమైంది కావడం.. రాజకీయంగా వివాదాలకు కేంద్రంగా మారిన నేపథ్యంలో ఈ విషయాన్ని అంతే గోప్యంగా ఉంచింది. అయితే.. తాజాగా ఇది వెలుగు చూసింది. మొత్తం 253 మందికిపైగా ఈ కేసుల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం వారంతా జైల్లోనే ఉన్నారు. జీవో విడుదలైన నేపథ్యంలోవారిపై కేసులు రద్దయి.. బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఏం జరిగింది?
ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విభజిస్తూ.. మొత్తం 26 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. వాస్తవానికి 25 పార్లమెంటు స్థానాలు మాత్రమే ఉండగా.. పెద్దదైన అరకు నియోజకవర్గాన్ని రెండుగా విభజించడంతో 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇక, కొత్త జిల్లాలకు ప్రముఖుల పేర్లు సహా.. స్థానికత ఉట్టిపడేలా పేర్లు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరిని విభజిస్తూ.. ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు.. అదే పేరును పెట్టారు.
అయితే.. ఈ జిల్లాకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చాయి. దీనిని తొలుత పరిగణనలోకి తీసుకోని జగన్ సర్కారు.. అనూహ్యంగా కొన్నాళ్ల తర్వాత.. రాత్రికి రాత్రి పేరు మార్చేసింది. ఇది తీవ్ర నిరసనలకు.. దారితీసింది. ఓ సామాజిక వర్గానికి చెందిన యువత పెద్ద ఉత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఇది విధ్వంసానికి దారితీసింది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, మంత్రి పినిపే విశ్వరూప్ ఇళ్లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు.
పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు స్టేషన్‌కు కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనలు జిల్లాతో పోటు.. రాష్ట్రాన్ని కూడా వణికించాయి. ఈ క్రమంలో పోలీసులు 6 ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేసి.. 253 మందిని అరెస్టు చేశారు. వీరిని జైలుకు కూడా పంపించారు. అయితే.. ఆయా కుటుంబాలు సహా.. ఆందోళనకుదిగి న కీలకమైన సామాజిక వర్గం విన్నపాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయా కేసులను ఉపసంహరించుకుంది. ఇది అప్పట్లో టీడీపీ-జనసేనలు వైసీపీపై నిప్పులు చెరగడానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు జీవోను ఇన్నాళ్లుగా బయట పెట్టలేదు. ఇక, ఇప్పుడు ఎన్నికల ముందు.. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు బయటకు చెప్పడం.. గమనార్హం.