తిరువూరు లో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభలో షాకింగ్ సీన్లు చోటు చేసుకున్నాయి. టీడీపీ.. జనసేన ఆధ్వర్యంలో ‘రా.. కదలి రా’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఇద్దరు పాల్గొనగా.. తెలుగు తమ్ముళ్లతో పాటు.. జనసేన కార్యకర్తలు సైతం భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీలకు చెందిన జెండాలు రెపరెపలాడాయి. అంతా బాగానే ఉందనుకున్న వేళ.. అకొందరు కార్యకర్తల చేతుల్లోని జెండాలు హాట్ టాపిక్ గా మారటమేకాదు.. తెలుగు తమ్ముళ్లకు షాకిచ్చేలా మారాయి.
ఆ జెండాలపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను ప్రింట్ చేసి ఉండటమే కాదు.. సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ పేర్కొన్న జెండాల్ని కొందరు ప్రదర్శించారు.మరికొందరు టీడీపీ జెండా మీద సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొనటం కనిపించింది. జెండాలతో పాటు.. అక్కడక్కడా బ్యానర్లు కూడా కట్టేయటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ జెండాలపైనా.. బ్యానర్ల పైనా కొందరు టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. వాటిని పక్కకు తీసేయాలని చెప్పటం కనిపించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావటం.. ఆ సందర్భంగా అందరూ స్పందించగా.. జూనియర్ ఎన్టీఆర్ కానీ.. ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కానీ రియాక్టు అయ్యింది లేదు. అరెస్టు వేళ.. బాలక్రిష్ణ కీలకంగా వ్యవహరిస్తే.. టీడీపీ వర్గాలు మాత్రమే కాదు.. చంద్రబాబు కుటుంబం సైతం అంచనా వేయలేని రీతిలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలవటమే కాదు.. తనకు తానే టీడీపీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని.. ఆ పార్టీకి మిత్రపక్షంగా నిలిచి.. సీఎం జగన్ ను పదవి నుంచి తప్పించటమే లక్ష్యమని పేర్కొనటం తెలిసిందే.
ఇలా చంద్రబాబుకు అండగా నిలిచిన పవన్ తో పోలుస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటిది మైలవరం సభలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ జెండాలు.. ఫ్లెక్సీలు దర్శనమివ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.