అంబటి రాయుడు ఎంతో ప్రతిభ కలిగిన క్రికెటర్. కానీ ఆ ప్రతిభకు తగ్గట్లు అతడి కెరీర్ వెలిగిపోయిందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ఆటతో పాటు ఓపిక, క్రమశిక్షణ, అవకాశాలను సరిగ్గా అందిపుచ్చుకునే లక్షణం ఒక ఆటగాడికి చాలా అవసరం. అపార ప్రతిభ ఉన్నప్పటికీ.. ఈ లక్షణాలు లేక, సరైన గైడెన్స్ దొరక్క, ఆశ్రితపక్షపాతం వల్ల అతను కెరీర్లో వెనుకబడ్డాడు.
టీనేజీలోనే గొప్ప బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న రాయుడు.. భారత క్రికెట్ జట్టులోకి రావడానికి ఎంతో సమయం పట్టదు అనిపించింది. కానీ హైదరాబాద్ క్రికెట్ లో రాజకీయాల మూలంగా కెరీర్ ఆరంభంలో అనుకున్నంతగా ఎదగలేకపోయాడు. కానీ తన రోజు వచ్చేవరకు కొంచెం ఆగాల్సిందే. అలా చేయకుండా ఆవేశపడి బీసీసీఐకి వ్యతిరేకంగా పెట్టిన రెబల్ క్రికెట్ లీగ్ ఐసీఎల్ లోకి వెళ్లిపోయాడు. దాని వల్ల చాలా ఏళ్లపాటు నిషేధానికి గురై.. భారత జట్టులోకి ప్రవేశం కోల్పోయాడు.
ఆ తర్వాత నిషేధం తొలగిపోయి ఐపీఎల్ లోకి వచ్చాడు. ఆపై భారత జట్టులోనూ అడుగు పెట్టాడు. కానీ తన ప్రతిభకు తగ్గ స్థాయిలో ఎదగలేక పోయాడు. 2019 ప్రపంచ కప్ అవకాశాన్ని తృటిలో కోల్పోయి చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మీద కౌంటర్ వేయడం తన అంతర్జాతీయ కెరీర్ మీద ప్రభావం చూపింది. ఇలాంటి వాటిని బీసీసీఐ ఏమాత్రం సహించదు. అందుకే రాయుడు మళ్ళీ భారత జట్టులోకి రాలేక పోయాడు. ప్రపంచ కప్ లో ఛాన్స్ రాలేదని ఆవేశంగా రిటైర్మెంట్ ప్రకటించడం, మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం రాయుడి ఆవేశపూరిత, చంచల మనస్తత్వానికి నిదర్శనం. ఇప్పుడు తన పొలిటికల్ ఇన్నింగ్స్ విషయంలోనూ ఇలాగే చేశాడు. ముందు అతను టీడీపీలో చేరతాడు అని వార్తలు
వచ్చాయి. అయితే ఒకసారి టచ్ లోకి వెళ్ళాక ఆ పార్టీ నేతలు తనను సరిగా పట్టించుకోలేదని వైసీపీ వైపు చూశాడు. కొన్నాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీతో పనిచేసి తర్వాత అధికారికంగా వైసీపీలో చేరాడు. టికెట్ హామీ సహా అన్ని చూసుకుని, ఒక ఒప్పందం ప్రకారమే వైసీపీలో రాయుడు చేరి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ పార్టీలో చేరిన వారం రోజులకే అందులోంచి బయటికి వచ్చి తన చంచల మనస్తత్వాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. ఇందుకు దారి తీసిన కారణాలు ఏవైనప్పటికి రాయుడు ముందు అన్ని చూసుకుని పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సింది కదా, ఇలా పార్టీలో చేరిన వారానికే బయటికి రావడం ఏంటి, రాయుడు ఎప్పుడు ఇంతేనా, ఇక మారడా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.