నూతన సంవత్సరాది సందర్భంగా ప్రజలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఆకాంక్షలు, ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. గత సంవత్సరం అందించిన అనుభవాలతో నూతన ఏడాదిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 2024లో ఏపీ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలు మలుపు కావాలని ఆకాంక్షించారు. ప్రజలు తీసుకోబోయే నిర్ణయం కచ్చితంగా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలపై ప్రభావం చూపిస్తుందన్నారు. 2024 సంవత్సరం అందరిలో నూతనోత్సాహాన్ని, సుఖ సంతోషాలను నింపాలని పవన్ కోరుకున్నారు.
ఇక, పవన్ అర్ధాంగి అనా కొణిదెల నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లో ఒక అనాథ శరణాలయాన్ని సందర్శించారు. అనాథ బాలలతో ముచ్చటించిన అనా…వారి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. దాంతోపాటు, ఐదుగురు బాలికల స్కూలు ఫీజు చెల్లించారు. ఆ అనాథ శరణాలయానికి అవసరమైన నిత్యావసరాలను భారీ మొత్తంలో సమకూర్చారు. అనాథ బాలలకు అవసరమైన వస్తువులను అందించారు. పవన్ లాగే అనా కూడా మానవతావాది అని జనసైనికులు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.