ఏపీలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్.. భారీగా తగ్గుముఖం పట్టింది. పంచాయతీ సహా.. గత నెల 10న జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల తరహాలో ప్రస్తుత పరిషత్ ఎన్నికలు సాగడం లేదు. ఎక్కడికక్కడ ఓటర్లు నిర్లిప్తతగా ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కు అత్యంత ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రచారానికి, ప్రజలను కలిసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ నీలం సాహ్ని.. అవకాశం ఇవ్వలేదని పేర్కొంటూ.. టీడీపీ సహా కొన్ని పక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. \
దీనిపై విచారించిన ఏకసభ్య బెంచ్.. ఎన్నికలపై స్టే విధించింది. అయితే.. ద్విసభ్య ధర్మాసనం మాత్రం ఈ స్టేను ఎత్తేసి.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. బుధవారం సాయంత్రం 4గంటల వరకు కూడా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయం ఉత్కంఠగా మారింది. ఇక, చివరి నిముషంలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో.. అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. సరే.. ఇప్పుడు పోలింగ్ మొదలైనా.. ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా.. పోలింగ్ శాతం భారీగా తగ్గింది.
ఉదయం 10గంటల సమయానికి.. శ్రీకాకుళంలో 9%, విజయనగరంలో 9%, పశ్చిమ గోదావరిలో 10%, విశాఖలో 9%, గుంటూరులో 8%. తూర్పు గోదావరి జిల్లాలో 4.59%, కృష్ణాలలో 9.32%, ప్రకాశంలో 6.53%, న ఎల్లూరులో 6.36%, చిత్తూరులో 7.29%, కడపలో 4.81%, కర్నూలులో 9% అనంతపురంలో 7.76% మాత్రమే పోలింగ్ నమోదైంది.
అయితే.. గత నెలలో జరిగిన స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రం ఉదయం 10 గంటల సమయానికి 20-30% మధ్య పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఇక్కడ చిత్రం ఏంటంటే.. సీఎం సొంత జిల్లా కడపలోనే పోలింగ్ శాతం భారీగా పడిపోవడం. మొత్తానికి ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగితే.. పరిషత్ ఎ న్నికల్లో ఓవరాల్గా 30% ఓటింగ్ కూడా పెరిగే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.