నిజమే… ఏపీ పారిపాలనా రాజధానిగా వైసీపీ సర్కారు ప్రచారంలోకి తీసుకొచ్చిన సాగర నగరం విశాఖలో జగన్ సర్కారు అమలు చేస్తున్న వ్యూహాలను చూస్తుంటే… పైమాట నిజమేననిపించక మానదు. ఎందుకంటే… విశాఖ లాంటి మహా నగరంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా… దానిని సద్వినియోగం చేసి, నగర ప్రజలకు అహ్లాదం, ఆపై రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయాలి. మొన్నటిదాకా ఏపీ ప్రభుత్వంలో ఇదే పంథా కొనసాగినా… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా మారిపోయిన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది.
సర్కారీ భూములను ప్రజలకు ఉపయోగమయ్యే వ్యవహారాలకు కాకుండా ఏకంగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు తెగనమ్మే పనులు మొలలైపోయాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ నగరంలో ప్రభుత్వానికి చెందిన 13.59 ఎకరాల భూమిని ప్రైవేట్ కు ధారాదత్తం చేసే దిశగా సాగుతున్న చర్యలు నిజంగానే విస్మయానికి గురి చేసేవేనని చెప్పాలి.
గతంలో ఇదే భూములను ప్రైవేట్ వ్యక్తులకో, సంస్థలకో విక్రయించడానికి బదులుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉండగా… వీటితో నగరంలో భారీ అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. అక్కడ ప్రభుత్వ భూమి 10 ఎకరాలే ఉంటే… దానిని ఆనుకుని ఉన్న మరో 3.59 ఎకరాలను ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసి మరీ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని టీడీపీ సర్కారు ప్లాన్ చేసింది. ఈ భూమిని ప్రపంచ ప్రసిద్ధి గారించిన లులూ సంస్థతో ఒప్పందం చేసుకుని అక్కడ అతిపెద్ద షాపింగ్ మాల్ తో పాటు స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానికంగా 6 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్సించింది.
అయితే ఈ పనులు పూర్తి కాకముందే… టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ పాలన మొదలైపోవడం జరిగిపోయింది. మరి నాడు అభివృద్ధి చేయాలనుకున్న భూములను అమ్మేయాలని ఆలోచిస్తున్న జగన్ సర్కారు అందుకు సంబంధించి తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసేసింది. వాస్తవంగా పాలనా రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్న విశాఖలో ప్రభుత్వ స్థలాలు జగన్ సర్కారుకు చాలా అవసరమనే చెప్పాలి. అయితే అందుకు విరుద్ధంగా ప్రైమ్ ఏరియాలో ఉన్న 13.59 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల జనాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక జగన్ అమ్మేయాలనుకున్న ఈ భూముల విలువ ఎంతంటే… అక్షరాలా రూ.1,465 కోట్లు. ఈ మేర విలువ చేసే భూములతో సర్కారు ఏమేర అయిన అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. టీడీపీ హయాంలో లులూ సంస్థ ఈ భూముల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏకంగా రూ.2,200 కోట్లను చెల్లించేందుకు కూడా సిద్ధపడింది. అంటే… అమ్మేస్తే రూ.1,465 కోట్లు మాత్రమే వస్తుంటే… అభివృద్ధి కోసం ఇస్తే… ఖజానాకు రూ.2,200 కోట్లు రావడంతో పాటు ఆ భూమి భవిష్యత్తులోనూ సర్కారు ఆస్తిగానే మిగిలిపోతుంది.