మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన శాసన సభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే.. ఈ వార్తను జీర్ణించుకునేలోగానే.. మంగళగిరిలో మరిన్ని రాజీనామాలు వెలుగు చూశాయి. పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ కూడా.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.
“పార్టీలో కొన్ని దశాబ్దాలుగా(కాంగ్రెస్) ఉన్నా. వైసీపీ గెలుపు కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీలో మాకు ప్రాధా న్యం లేకుండా పోయింది. ఎమ్మెల్యేను అనుసరించి మేం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేనే గౌరవించడం లేదు. మేం ఉండి ఏంచేయాలి? అందుకే.. పార్టీకి రాజీనామా చేస్తున్నా. భవిష్యత్తులో ఆళ్ల సర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. మేం కూడా దానినే అనుసరిస్తాం“ అని ఆకురాతి వెల్లడించారు.
ఇదిలావుంటే.. మంగళగిరి మండలాల్లోనూ వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. కీలకమైన దుగ్గిరాల, పెద్దకాకాని, చిన్నకాకాని, మంగళగిరి రూరల్ మండలాల్లోనూ నాయకులు రాజీనామాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఆళ్ల రాజీనామా విషయం తెలిసిన వెంటనే సదరు నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆళ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. తామంతా ఆళ్ల వెంటేనని ప్రకటించారు. దీంతో ఈ రోజు రేపట్లో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు మొత్తం తమ స్థానాలను ఖాళీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.