పెద్ద పాల కుండను నాశనం చేయటానికి ఒక్క చుక్క విషం చాలు. పాలన ఎంత పక్కాగా చేస్తున్నా.. అధికార పార్టీ అన్న అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే కొందరు చేసే నష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి వారికి దిమ్మ తిరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతం స్పష్టం చేస్తోంది. కన్నేసిన మహిళపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించిన అధికార పార్టీ వైసీపీ కి చెందిన నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి ఉదంతాలపై ఫిర్యాదులు అందినంతనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలేం జరిగిందంటే..బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పెదగొల్లపాలెం పంచాయితీ పరిధికి చోందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ నెల నాలుగున ఇంట్లో ఉన్నారు. భర్త విజయవాడకు వెళ్లటంతో ఆమె.. పిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో.. రాత్రి పది గంటల వేళలో.. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నేత వివాహిత ఇంటి కరెంటు ఫ్యూజు తొలగించి తలుపుకొట్టాడు. చీకట్లో ఎవరూ అనే లోపే.. ఆమెపై ఆఘాయిత్యం చేసే ప్రయత్నం చేశాడు. ఆమె పెద్ద పెద్దగా కేకలు వేయటంతో పారిపోయాడు.
జరిగిన దారుణం గురించి తర్వాతి రోజు ఉదయమే గ్రామ పెద్దలకు చెప్పగా న్యాయం చేస్తామని చెప్పి.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో.. ఈ నెల ఆరున పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఎస్ఐ అందుబాటులో లేరు. చివరకు ఆ సాయంత్రం ఎస్ఐ కంప్లైంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. ఎలాంటి స్పందన లేదని.. పోలీసుల్ని అడిగితే సరైన సమాధానం ఇవ్వట్లేదని చెబుతున్నారు.
దీనిపై మీడియా ప్రతినిధులు పోలీసుల్ని సంప్రదించగా.. తమకు ఫిర్యాదు అందిన మాట వాస్తవమేకానీ.. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పటం గమనార్హం. పోలీసుల తీరుపై విమర్శల నేపథ్యంలో ఆదివారం రాత్రికి కాని కేసు నమోదు చేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గతంలో.. ఆరుగురు మహిళలపై అత్యాచార యత్నం చేయటం.. గ్రామపెద్దలు మందలించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తక్షణమే చేపట్టాలని.. లేదంటే అధికార పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.