దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాలపట్టి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి పీటల మీదకు ఎక్కబోతున్నాడు. ఆ మధ్యన షర్మిలతో పాటు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చే క్రమంలో.. అందరి కంట్లో పడిన రాజారెడ్డి.. తాజాగా తన పెళ్లి ముచ్చటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయిని రాజారెడ్డి పెళ్లాడనున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఆ అమ్మాయి ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. బయటకు వచ్చిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాజారెడ్డి.. తాను చదువుకునే సమయంలోనే ఆ అమ్మాయితో ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఆ అమ్మాయి ఎవరో కాదు.. ప్రముఖ రెస్టారెంట్ల ఛైన్ ‘‘చట్నీస్’’ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనమరాలు ప్రియ అట్లూరిగా చెబుతున్నారు. ఆమెకు యూఎస్ పౌరసత్వం ఉంది. వీరిద్దరూ గడిచిన నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
షర్మిల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. పెళ్లి కుమార్తె కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావటం.. ఈ రెండు సామాజిక వర్గాల మధ్య.. అదీ వైఎస్ ఫ్యామిలీలో వియ్యం పొందేందుకు ఓకే చెప్పటం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చగా మారింది. వీరి ప్రేమకు షర్మిల.. అనిల్ కుమార్ దంపతులు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. మరోవైపు అట్లూరి కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే మేలో వీరి పెళ్లి జరగనున్నట్లుగా చెబుతున్నారు. వీరిద్దరూ తొలిసారి చర్చిలో కలిసినట్లుగా వారి సన్నిహితులు తెలియజేస్తున్నారు.
నిజానికి షర్మిల కూడా కులాంతర వివాహం చేసుకోవటం తెలిసిందే. షర్మిల భర్త అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే.. క్రైస్తవంలోకి మారటం.. మత ప్రచారకుడిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. పెళ్లి పీటల మీదకు ఎక్కనున్న రాజారెడ్డి విషయానికి వస్తే.. అతను అమెరికాలోని డల్లాస్ వర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు. ఏమైనా.. రాజారెడ్డి.. ప్రియల పెళ్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పక తప్పదు.