ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామ….ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సఖ్యతతో ఉంటూ సంబంధాలు నెరపడంతో ఆయనపై జగన్ చర్యలేవీ తీసుకోకుండా మిన్నకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ కు పక్కలో బల్లెంలా మారిన రఘురామ తాజాగా మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పై సీబీఐ 11 చార్జిషీట్లు ఫైల్ చేసిందని, సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా తాను ఈ పిటిషన్ వేశానని రఘురామ అన్నారు. సీబీఐ ఇన్ని ఛార్జిషీట్లు వేసినా విచారణలో జాప్యంపై రఘురామ అసహనం వ్యక్తం చేశారు.
జగన్ త్వరగా కేసుల నుంచి బటయపడాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కేసు వేశానని రఘురామ క్లారిటీ ఇవ్వడం కొసమెరుపు. బెయిల్ రద్దు చేస్తే త్వరగా ఈ కేసుల గోల తేలిపోతుందని తాను నమ్ముతున్నానని చెబుతున్నారు రఘురామ. జగన్ గురించి ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదనే కోర్టుకు వెళ్లానని అన్నారు. కోర్టులకు వెళ్లకపోతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని హితవు పలికారు.
జయలలిత, లాలూల తరహాలో జగన్ కూడా వేరొకరిని సీఎం స్థానంలో కూర్చోబెట్టి కేసుల నుంచి బయటపడాలని జగన్ కు రఘురామ సూచించారు. సుప్రీం కోర్టు సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో రఘురామ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి, రఘురామ వ్యాఖ్యలపై జగన్, వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.