టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత తాడేపల్లి చేరుకునే వరకు ఎక్కడికక్కడ టీడీపీ నేత లు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దాదాపు 14 గంటల పాటు ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇదంతా ఒక ర్యాలీలా జరిగిందని, చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించారని కోర్టులో సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. బెయిల్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని, మీడియాతో మాట్లాడకూడదని, మరిన్ని ఆంక్షలు విధించాలని కోరారు.
దీంతో, చంద్రబాబు మీడియాతో మాట్లాడటం ఆయన ప్రాథమిక హక్కు అని, అది రాజ్యాంగం కల్పించిందని చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ కాన్వాయ్ ర్యాలీ వ్యవహారంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. కోర్టు నిబంధనల ప్రకారమే చంద్రబాబు కాన్వాయ్ సాగిందని అచ్చెన్న వెల్లడించారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ర్యాలీలు చేశారని, లోకేష్ ఢిల్లీ వెళితే సజ్జలకు, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
ప్రజలు ఛీ కొడుతున్నా సరే వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కోర్టు నిబంధనలు లేకుంటే ఇప్పుడు వచ్చిన దానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చి ఉండేవారని అన్నారు. చంద్రబాబు కారులోనే ఉండి ప్రజలకు కార్యకర్తలకు అభివాద మాత్రమే చేశారని క్లారిటీనిచ్చారు. ఇక, చంద్రబాబు తప్పు చేసినట్టు ఆధారం చూపలేకపోయారని, అందుకే మద్యం టెండర్లు అంటూ కొత్త కేసు పెట్టారని మండిపడ్డారు.