హీరో వైకల్యం ఉన్న పాత్ర చేయడం అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు హీరోకు ఏదో ఒక వైకల్యమో, లోపమో ఉంటేనే కొత్తగా ఫీలవుతున్నారు ప్రేక్షకులు. రంగస్థలం సినిమాలో చరణ్ చెవిటివాడి పాత్ర చేస్తే ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలిసిందే. తమిళ కథానాయకుడు విక్రమ్ తన కెరీర్లో వైకల్యాలు, లోపాలు ఉన్న పాత్రలు చాలానే చేశాడు.
పితామగమన్ సినిమాలో మాటలే లేని కాటి కాపరి పాత్రను అతనెంత గొప్పగా పండించాడో తెలిసిందే. అతను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పాత్రను గుర్తు చేసే క్యారెక్టర్లో కనిపించనున్నాడు. పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న తంగలాన్ సినిమాలో తన అవతారం చూసి ప్రేక్షకులు ఎలా షాకైపోతున్నారో తెలిసిందే. తాజాగా రిలీజైన టీజర్ చూసిన వాళ్లకు అసలు మాటలు రావడం లేదు.
విక్రమ్ డీగ్లామరస్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. తంగలాన్‌లో మేకోవర్ నెక్స్ట్ లెవెల్ అన్నట్లే ఉంది. తన లుక్ మాత్రమే కాక పాత్ర చిత్రణ కూడా చాలా వయొలెంట్‌గా ఉండి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పాత్రకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. సినిమా మొత్తంలో దానికి ఒక్క డైలాగ్ కూడా ఉండదట.
ఈ విషయాన్ని స్వయంగా విక్రమే వెల్లడించాడు. పితామగన్లో మాదిరే ఇందులోనూ తన పాత్రకు మాటలుండవని.. కేవలం హావభావాలు, అరుపులతోనే ఈ పాత్రను పోషించానని విక్రమ్ తెలిపాడు. పాత్ర కోసం ఏం చేయడానికైనా, ఎంత కష్టపడడానికైనా రెడీ అన్నట్లుంటాడు విక్రమ్. సేతు మొదలుకుని తంగలాన్ వరకు అతను ఒళ్లు హూనం చేసుకుని చేసిన పాత్రలు ఎన్నెన్నో. ఐతే తన కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చే సినిమా వచ్చి చాలా కాలం అయింది. మరి తంగలాన్ అయినా విక్రమ్‌కు సరైన ఫలితం అందిస్తుందేమో చూడాలి.