టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర శ్రీకాళహస్తిలో కొనసాగింది. తొట్టంబేడు మండలంలోని కాసరం గ్రామంలో దివంగత టీడీపీ కార్యకర్త పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వెంకట సుబ్బయ్య గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని వెంకట సుబ్బయ్య కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందజేశారు.
ఆ తర్వాత తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో భువనేశ్వరి ఏపీ ప్రభుత్వంపై, జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం దేశ ప్రజలు పోరాడారని, జగన్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పౌరుషం, చంద్రబాబు పోరాట పటిమతో పోరాడితే విజయం తథ్యమని అన్నారు. చంద్రబాబు నిర్దోషి అని తాను గ్యారెంటీ ఇస్తున్నానని, సీఐడీ అధికారులు టీడీపీ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని, తాము భయపడబోమని అన్నారు.
పవన్ కూడా తమలాగే ప్రజల కోసం ఆలోచిస్తున్నారని, టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళతాయని, లోకేష్ త్వరలోనే పాదయాత్ర మొదలుపెడతారని వెల్లడించారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టడంలో ప్రభుత్వం బిజీగా ఉందని, పరిశ్రమలను తీసుకురావడంలో వెనుకబడిందని చెప్పారు. పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలివెళుతున్నాయని, ఉద్యోగాల కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.