స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. చంద్రబాబు రిమాండ్ ను నవంబరు 1వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. గురువారం(అక్టోబరు 19)తో చంద్రబాబు రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వర్చువల్గా చంద్రబాబును కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు ను జడ్జి కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
జైలులో ఏమైనా ఇబ్బందులున్నాయా? ఆరోగ్య సమస్యలున్నాయా? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. టవర్ ఏసీ పెట్టిన తర్వాత జైలు గదిలో వాతావరణం గురించి చంద్రబాబును జడ్జి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.జైలులో తన భద్రతపై అనుమానాలున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతోపాటు, జైల్లోని తన ఫొటోలను కొందరు మీడియాకు లీక్ చేసిన విషయాన్ని కూడా జడ్జి దృష్టికి చంద్రబాబు తీసుకువచ్చారని తెలుస్తోంది.
అయితే, ఫోటోల వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని జడ్జి చెప్పారని తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబు రాసే సందేహాలకు సంబంధించిన లేఖను తనకు పంపించాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు. ఇక, రేపు శుక్రవారం నాడైనా సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.