ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ-జనసేనల జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలపై పవన్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ తో భేటీ అయిన పవన్ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కానీ, బీజేపీతో కలిసి వెళతాం అని పవన్ చెబుతుండగా…బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో కలిసే విషయంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే, తెలంగాణ ఎన్నికల నగారా మోగిన తరుణంలో జనసేన అక్కడ పోటీ చేస్తుందా లేదా అన్న ఉత్కంఠ మాత్రం వీడలేదు.
తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన దిగాలని నేతలు, కార్యకర్తలు భావిస్తుండగా…పవన్ మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీతో జనసేన కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని, పొత్తు పెట్టుకోవాలని పవన్ తో కిషన్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడిగా బరిలోకి దిగాలని జనసేన-బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించగా…బీజేపీ త్వరలోనే ఫస్ట్ లిస్ట్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు 40 మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలని కిషన్రెడ్డి, బీజేపీ ముఖ్యనేతలకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.