టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తాజాగా భారీ ఊరటనిచ్చింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా..ఈ కేసులోని నిందితులంతా రూ.లక్ష పూచీకత్తు చెల్లించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దంటూ సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించడంతో సోమవారం నాడు చంద్రబాబు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే, ఒకవేళ శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో తీర్పు వస్తే చంద్రబాబు హాజరుపై నిర్ణయంలో మార్పు ఉండే అవకాశముంది.