దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీ ముఖ్యమంత్రి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక భద్రతను కల్పించేందుకు వీలుగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేశారు. ఏపీ సీఎం.. ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రత్యేక సెక్యూరిటీ వింగ్ ను ఏర్పాటు చేయటమే కాదు.. విదేశాల్లో ఉన్న పిల్లలకు.. తన తల్లికి.. తన భార్యకు ప్రత్యేక భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేశారు.
తాజా చట్టం ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిద్దరికి కూడా అక్కడకు సెక్యూరిటీని పంపి భద్రత కల్పిస్తారు. దేశంలోని ఇన్ని రాష్ట్రాల్లోనూ లేని రీతిలో ఈ కొత్త చట్టాన్ని ఏపీలో తీసుకొచ్చారు. మావోల సమస్యను తీవ్రంగా ఎదుర్కొనే ఛత్తీస్ గఢ్.. ఒడిశా రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల భద్రత కోసం ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసి.. వారి భద్రత కోసం ఇలాంటి ఫోర్సును ఏర్పాటు చేయలేదంటున్నారు.
ఇప్పటివరకు దేశ ప్రధాని భద్రత కోసమే ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంది. ఇప్పుడు అదే స్థాయిలో ఏపీ సీఎంకు.. ఆయన సతీమణికి.. ఆయన ఇద్దరు కుమార్తెలకు ప్రత్యేక భద్రతను కల్పిస్తారు. తాజా చట్టం ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల(భార్య.. పిల్లలు.. తల్లిదండ్రులు)కు అన్ని సందర్భాల్లోనూ ఎస్ ఎస్ జీ నిరంతరం రక్షణ కల్పించనున్నారు. దేశ విదేశాల్లో ఈ మేరకు అవసరమైన భద్రతా పరమైన సేవల్ని అందించేందుకు ఈ టీంలోని సభ్యులు సిద్ధంగా ఉంటారు.
ఈ చట్టంలో భాగంగా 431 పోస్టులను పూర్తిగా ఎస్ ఎస్ జీకే కేటాయించారు. వీరు కాకుండా పోలీసు శాఖలో వివిధ విభాగాల నుంచి డెప్యూటేషన్ ప్రాతిపదికన సిబ్బందిని తీసుకోనున్నారు. ఈ సిబ్బంది వారు ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. ప్రయాణ సమయంలోనూ.. ఎక్కడకు వెళ్లినా.. ఎక్కడ బస చేసినా కూడా ఈ టీం సభ్యులు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తారు. అయితే.. ఇప్పటికే ఉండే భద్రత సరిపోదన్నట్లుగా ఇప్పుడు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి మరీ భద్రతను ఏర్పాటు చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.