చిత్తూరు జిల్లాలోని అంగళ్లులో కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్ల కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కు యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో, చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ కారణాలతోనే ఈ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక, ఏపీ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. అయితే, వాదనలు పూర్తికాకముందే కోర్టు సమయం ముగియడంతో ఈ పిటిషన్ పై విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ వ్యవహారంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగబోతోన్న సంగతి తెలిసిందే.
ఇక, ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా చేరుస్తూ ఏపీ సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, రేపో మాపో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని పుకార్లు వస్తున్నాయి. అయితే, తనను ఏ14గా చేర్చడంపై లోకేష్ స్పందించారు. యువగళం తిరిగి ప్రారంభించబోతున్నామని ప్రకటించగానే ఈ కేసులో తన పేరు పెట్టారని లోకేష్ ఆరోపించారు. పాదయాత్ర పేరు చెబితే జగన్ భయపడిపోతున్నారని, అందుకే తనను అడ్డుకునేందుకు ఈ రకంగా ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.