రాజకీయాలు.. అందునా ఇప్పటి దూకుడు రాజకీయాల్లో తమ ప్రత్యర్థులను ఉతికి ఆరేసేందుకు రాజకీయ పార్టీలు అస్సలు వెనుకాడటం లేదు. గతంలో మాదిరి విలువలు పాటించే ధోరణిని పూర్తిగా వదిలేసి.. మాటలతో కుళ్లబొడిచే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అయితే.. తాము టార్గెట్ చేసిన నాయకుడి వరకు విమర్శలు సంధించటం వరకు ఓకే కానీ.. ఆ పేరుతో మిగిలిన వారిని సైతం ఉతికి ఆరేసే కార్యక్రమానికి తెర తీస్తే.. అసలు విషయం డైవర్ట్ అవుతుందన్న చిన్న లాజిక్ ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మిస్ కావడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు అంటేనే మండిపడే విజయసాయి.. ఆయనపై పంచ్ లు వేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కారన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆయన ప్రదర్శించిన దూకుడుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. విషయం అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నాలుగు మాటలు అనేందుకు అవకాశం ఇచ్చేలా ఉండటమే అసలు సమస్య. తాజాగా రాజ్యసభలో మాట్లాడిన విజయసాయి.. తాను ఎంచుకున్న సబ్జెక్టుకు భిన్నంగా చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి మరీ.. పంచ్ లు వేయటం మొదలు పెట్టారు.
చంద్రయాన్ 3 అంశంపై మాట్లాడేందుకు మైక్ తీసుకున్న విజయసాయి.. చంద్రబాబును టార్గెట్ చేశారు. దేశంలో తాను ఎన్నో చేసినట్లు కాంగ్రెస్.. బీజేపీ చెప్పుకొంటుంటే.. మధ్యలో మా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వచ్చి.. తాను సైన్స్ కు ఎంతో చేసినట్లుగా ప్రకటించుకుంటారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎన్నోసార్లు తానే కంప్యూటర్ ను తయారు చేసినట్లు.. అంతరిక్షపరిశోధనలకు తానే ఆద్యుడినైనట్లు.. సెల్ ఫోన్ తానే కనిపెట్టినట్లుగా ప్రకటించుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.. బీఆర్ఎస్ సభాపక్ష నేత కేకేలు అడ్డుపడ్డారు. వారిని కూర్చోవాలన్న విజయసాయి తన మాటల్ని ఆపలేదు. చంద్రబాబుపై విమర్శలను కంటిన్యూ చేశారు. విజయసాయి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన డీఎంకే సభాపక్ష నేత తిరుచ్చి శివ లేచి ప్రశ్నించగా.. తన ప్రసంగానికి అడ్డుపడే హక్కులేదంటూ ఆయనపైనా ఫైర్ అయ్యారు. నిజంగానే చంద్రబాబు అన్నీ కనిపెట్టారా? లేదా? అన్న విషయాన్ని విచారించి కనిపెట్టాలన్న విజయసాయి మాటల్ని కంటిన్యూ చేస్తూ మరిన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ఆరాచక పార్టీగా విజయసాయి అభివర్ణించారు.
ఇలా కంటిన్యూ అవుతున్న విజయసాయికి చివర్లో విజయసాయికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అప్పటివరకు ఆయన మాటల్ని విని ఎంజాయ్ చేసిన వారంతా.. అనూహ్యంగా టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఇబ్బందికి గురయ్యారు. బెయిల్ మీద ఉన్న నాయకుడు.. జైల్లో ఉన్న నాయుడిని ప్రశ్నిస్తున్నారంటూ విజయసాయి మీద ఆ ఎంపీ చేసిన వ్యంగ్య వ్యాఖ్య.. ఆయనకు మాత్రమే కాదు.. జగన్ ను కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోని నెట్టినట్లు అయ్యిందన్న మాట వినిపిస్తోంది. బాబును మాటలతో ఏదో అనేయాలన్న ఊపులో ఉన్న విజయసాయి చివరకు జగన్ ను ఇరికించారని టాక్ వస్తోంది.