టాలీవుడ్ లో నందమూరి వంశానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ ఆయన వారసులు సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి అన్నగారి తనయుడు నందమూరి బాలకృష్ణ తండ్రి నటనా కౌశల్యాన్ని, రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. అన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్న బాలయ్య బాబు…విలక్షణ పాత్రలతో వెండితెరపై వెలిగిపోతున్నారు.
పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్….ఇలా అన్ని రకాల సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. నవరసాలను అవలీలగా పండిస్తున్నారు. అయితే, బాలయ్య బాబు ఆరు పదుల వయసు దాటడంతో ఆయన నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఎప్పుడెప్పుడు జరుగుతుంది అని నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, ఒక మంచి డైరెక్టర్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మోక్షజ్ఞ పరిచయం అవుతాడని లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ, మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉన్నాడని, హీరో లుక్స్ లేవని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి.
ఫిట్నెస్ పై లుక్ పై దృష్టి పెట్టిన మోక్షజ్ఞ అవి సాధించిన తర్వాతే సినిమాలలో అడుగుపెట్టాలని యోచిస్తున్నారని మరో టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను సినిమాలో నటించేందుకు రెడీ అన్న రీతిలో తాజాగా మోక్షజ్ఞ తన లుక్ తో నందమూరి అభిమానులకు హింట్ ఇచ్చాడు. తాజాగా, తన తండ్రి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి షూటింగ్ సెట్లో మోక్షజ్ఞ ప్రత్యక్షమయ్యారు. గతంతో పోలిస్తే బరువు తగ్గి మంచి లుక్ తో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న మోక్షజ్ఞ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దిరోజులు క్రితం నందమూరి కుటుంబంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన మోక్షజ్ఞ తాజాగా అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టాడు.
యంగ్ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ మోక్షజ్ఞలో పుష్కలంగా ఉండటంతో ఇక రేపోమాపో మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఖాయమని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. మరి, ఏ దర్శకుడితో ఎప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడు అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా..బాలయ్య బాబుకు తాను గట్టిపోటీనిస్తానని మోక్షజ్ఞ తన తాజా లుక్ తో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లేనని నందమూరి అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే సినిమాల విడుదల విషయంలో, ఫాలోయింగ్ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య క్లాష్ తప్పదని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.