జస్టిస్ బట్టు దేవానంద్. ఈయన గురించి అందరికీ తెలిసిందే. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమ యంలో ప్రభుత్వ చట్ట వ్యతిరేక నిర్ణయాలపై సంచలన తీర్పులు, ఆదేశాలు ఇచ్చి.. రికార్డు సృష్టించారు. అనేక మంది ఉన్నతాధికారులను కోర్టుగడపలు కూడా ఎక్కించారు. ఈయన ఉన్న బెంచ్ విచారణ చేపట్టిన కేసుల్లోనే అప్పటి సీఎస్‌లు, డీజీపీలు, ఎస్పీలు, ఐఏఎస్‌లు కోర్టుకు వెళ్లి నిలబడాల్సి వచ్చింది.
అనంతర కాలంలో ఆయన రాజధాని అమరావతి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా అమ్మాయి ఢిల్లీలో చదువుతోంది. మీ రాజధాని ఏది అని తోటి విద్యార్థులు ఆమెను గేలి చేస్తున్నారు. ఏమని చెప్పుకోవాలో తెలియక కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఇదీ.. మన రాష్ట్రం పరిస్థితి!“ అని జస్టిస్ బట్టు దేవానంద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమరావతి విషయాన్ని ప్రస్తావించారు. సరే.. తర్వాత ఆయన పొరుగు రాష్ట్రం తమిళనాడులోని మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఇక, తాజాగా మరోసారి గుంటూరులో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ బట్టు దేవానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల ఇళ్లలోను, వ్యక్తిగతంగాను.. ఏమైనా కేసులు నమోదైతే.. కొన్ని ఏళ్ల తరబడి అవి ముందుకు సాగవని.. ఏ వ్యవస్థా వారికి సహకరించదని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. అయితే.. అదేసమయంలో పెద్దవాళ్ల ఇళ్లలో జరిగే విషయాలపై నిజానిజాలు తెలిసినా కూడా.. చూస్తూ కూర్చోవడమేనని అన్నారు.
గుంటూరులో జరుగుతున్న అఖిల భారత న్యాయవాదుల సంఘం 5వ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఐదు కోట్ల కేసుల పెండింగు ఉన్నాయని.. అయితే.. సామాన్యులకు ఒకవిధంగా, పెద్దలకు మరో విధంగా పరిస్థితి ఉందని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించడం గమనార్హం.