ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని కాపాడేందుకు మాత్రమే పోలీసులు పనిచేయాలని ఎవరి కొమ్మూ కాయడానికి ఖాకీ డ్రస్‌ను వినియోగించుకోవద్దని కూడా.. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. నేరుగా డీజీపీని హైకోర్టుకు పిలిచి.. మరీ ఆక్షేపించారు. దీనికి ముందు కూడా.. విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను పెడ రెక్కలు విరిచి కట్టి.. అరెస్టు చేసిన తీరుకు అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ హైకోర్టులో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పదే పదే ఇలా ఎందుకు జరుగుతున్నాయనేది హైకోర్టు ప్రశ్నిస్తున్న మాట. దీంతో పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారనే వాదన ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది.
కట్ చేస్తే.. తాజాగా వినుకొండలో జరిగిన టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణ విష యంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు మరోసారి తీవ్ర వివాదంగా మారుతోంది. ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న మాట వాస్తవమే అయినా.. ఆయన ఈ క్రమంలో గాలిలోకి తుపాకీ పేల్చడాన్ని పోలీసు ఉన్నతాధికారులు కూడా తప్పుబడుతున్నారు. “అత్యంత కీలకమైన సందర్భంలోనే తుపాకీని వాడాలి. ఇప్పుడు జరిగిన విషయంలో ఏదో తేడా జరిగింది. ఇది.. సమాజానికి సరైన సందేశం ఇవ్వదు“- అని అదనపు డీజీ స్థాయి అధికారి మీడియా మిత్రుల వద్దే వ్యాఖ్యానించారు.
నిజానికి డిపార్ట్మెంటు పరంగా.. తుపాకులు ఇచ్చినా.. ప్రతి తూటాకి లెక్కలు చెప్పాలి. అంతేకాదు.. సందర్భం కూడా.. అత్యంత గట్టిదై ఉండాలి. కానీ, వినుకొండలో జరిగింది.. కేవలం సాధారణ రాజకీయ రగడే. అయినంతమాత్రాన సీఐ సంయమనం కోల్పోవడమే కాకుండా.. వైసీపీ కార్యకర్తల సాయంతో ఓ వాహనంపైకి ఎక్కి తుపాకీని గాలిలో పేల్చడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే.. ఈ ఘటన తర్వాత.. మళ్లీ పోలీసులపై విమర్శల పర్వం ప్రారంభం కావడం గమనార్హం.