ఆచితూచి అన్నట్లు అడుగుల్లేవు. లీకులు అసలే లేవు. ఏదైనా సరే.. ఉన్నది ఉన్నట్లుగా.. కుండ బద్ధలు కొట్టినట్లుగా.. లాగి పెట్టి ఒక్కటి పీకినట్లుగా వ్యవహరించిన రాములమ్మ వ్యవహారం తెలంగాణ బీజేపీలో షాకింగ్ గా మారింది. అధిష్ఠానం ఏం అంటుందన్న జంకు లేకుండా ఇంత ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్ది కాలంగా తెలంగాణ బీజేపీకి వరుస పెట్టి తగులుతున్న షాకులకు.. తాజాగా రాములమ్మ వేసిన ట్వీట్ పంచ్ మరో రేంజ్ కు తీసుకెళ్లిందని చెప్పాలి.
తెలంగాణ బీజేపీ రథసారధిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పజెబుతూ తీసుకున్న నిర్ణయంపై గతంలో ఎప్పుడూ లేని రీతిలో రాష్ట్ర పార్టీలో రెండు కుంపట్లు తయారయ్యాయి. గతంలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్న తేడా మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రం బండి వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్లుగా మారింది. పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన బండిని పక్కకు పడేసి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పిన వైనాన్ని తెలంగాణ బీజేపీకి చెందిన పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ విషయాన్ని ఓపెన్ గా కుండ బద్ధలు కొట్టేసినట్లుగా చేశారు విజయశాంతి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన ఆమె.. మధ్యలోనే వచ్చేశారు. ఈ ఉదంతాన్ని చాలామంది గుర్తించింది లేదు. టీవీ చానళ్లలో బ్రేకింగ్ న్యూసులు పడింది లేదు. కానీ.. కార్యక్రమం నుంచి మధ్యలో వెళ్లిపోయిన ఆమె.. కాసేపటికి ట్వీట్ చేశారు. తనకు తాను క్లారిఫికేషన్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆ ట్వీట్ లో తిరుగులేని పంచ్ ఉండటం గమనార్హం.
‘‘కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానంటూ పాత్రికేయ మిత్రులు నన్ను అడుగుతున్నారు. కానీ.. అది సరికాదు. కిషన్ రెడ్డిని అభినందించి.. శుభాశీస్సులు తెలియజేసిన తర్వాతే వచ్చాను. నాడు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించి.. తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఉన్న చోట ఉండటం నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల ముందుగా వెళ్లవలసి వచ్చింది. అక్కడ చివరి వరకు ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే వెళ్లిపోవాల్సి వచ్చింది’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాములమ్మ పేర్కొన్న నేత మరెవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.
విజయశాంతి ట్వీట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలాన్ని రేపింది. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి కిరణ్ రెడ్డిని ఆహ్వానించటంపై తనకు అభ్యంతరాలు ఉంటే.. వాటిని తెలియజేయాల్సిన మార్గాలు చాలానే ఉన్నాయి. అందుకు భిన్నంగా ట్వీట్ తో ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్ జరిగే వీలుంది. అయినప్పటికీ ఆ విషయాన్ని వదిలేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఏమైనా.. ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకోవటం టీ బీజేపీకి కొత్త అనుభవంగా మారింది. ఈ పరిస్థితిని కొత్త రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జాతీయ నాయకత్వం ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.