తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటు చూసినా మెగాస్టార్ చిరంజీవి అభిమానులే ఉంటారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మెగాస్టార్గా ఎదగడానికి చిరు పడ్డ కష్టం.. తన సినిమాలతో ఆయన అలరించిన విధానం చూశాక ఎవ్వరైనా అభిమానిగా మారిపోవాల్సిందే. ఇండస్ట్రీలో బయటే ఆయనకు ప్రాణం పెట్టే అభిమానులు ఉంటే.. మెగా ఫ్యామిలీలోని వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆ ఫ్యామిలీ హీరోల్లో ఎవ్వరూ కూడా నేను చిరంజీవి అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ కొన్ని పరిణామాలు, సోషల్ మీడియా పుణ్యమా అని మెగా ఫ్యామిలీలోని హీరోలే.. తాము చిరంజీవి అభిమానులమని.. ఆయనంటే తమకు ప్రాణమని చెప్పుకుంటే అది కూడా పెద్ద వార్తగా మారుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ ‘బేబి’ సినిమా అప్రిషియేషన్ మీట్లో చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటి ప్రాధాన్యమే సంతరించుకున్నాయి.
ఈ వేడుకలో బన్నీ ‘బేబి’ నిర్మాత ఎస్కేఎన్ గురించి మాట్లాడుతూ.. తనకు చిరంజీవి మీద, మెగా హీరోల మీద ఉన్న అభిమానం ఎలాంటిదో చెప్పుకొచ్చాడు. చివర్లో బన్నీ మాట్లాడుతూ.. అతనైనా, తానైనా కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానులం అని.. ఇందులో మరో మాట లేదని చెప్పాడు. ఈ మాటతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు మీద బన్నీ అభిమానానికి ఇది సాక్ష్యం అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఐతే తాను చిరంజీవికి వీరాభిమానిని అని బన్నీ చెప్పుకుంటే దాన్ని ఇంత విశేషంగా అందరూ చూడటం విడ్డూరంగా ఉందని చాలామంది అంటున్నారు. ఒకప్పటితో పోలిస్తే బన్నీ ఇప్పుడు చిరు పేరును ఎక్కువ తలవకపోవడం.. ఆయన్ని పొగడకపోవడం చూసి కొందరు మెగా అభిమానులు అపార్థం చేసుకున్నా.. చిరు మీద బన్నీ అభిమానం తరగనిది అనడానికి తాజా వ్యాఖ్యలు రుజువుగా నిలుస్తున్నాయి.