మీడియాకు అందుబాటులోకి రారన్న పేరు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మొదట్నించి ఉన్నదే. నిజానికి సినిమా స్టార్ గా ఉన్నప్పుడు మీడియాకు అందుబాటులో లేకున్నా ఫర్లేదు కానీ ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరి. కానీ.. అందుకు భిన్నంగానే వ్యవహరిస్తారు పవన్. తనకు అవసరమైనప్పుడు మాత్రమే అందుబాటులోకి వచ్చే ఆయన.. తాను అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం ప్రశ్న ఏదైనా సరే.. సమాధానం ఇచ్చేందుకు అస్సలు వెనుకాడరు.
ప్రశ్నకు అనుగుణంగా హావభావాలు మార్చేయటం.. చిక్కు ప్రశ్నలు వేసినప్పుడు తిట్టిపోయటం.. ఎదురుదాడి చేయటం లాంటివి చేయకుండా.. వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఈ కారణంగానే పవన్ ను పొలిటికల్ ఇంటర్వ్యూ చేసే విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఉండదని చెబుతారు. తాజాగా చేపట్టిన వారాహి విజయయాత్ర నేపథ్యంలో.. ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులతో పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఎదుర్కొన్న ప్రశ్నల్లో ఒకటి.. ప్యాకేజీ స్టార్.. దత్తపుత్రుడని విమర్శిస్తుంటారు కదా? అలాంటి ఆరోపణల్ని ఎలా తిప్పి కొడతారు? అని ప్రశ్నించనప్పుడు పవన్ స్పందిస్తూ..‘‘పార్టీ పెట్టినప్పుడు అసలు నిలబడతాడా? అన్న అనుమానం వ్యక్తం చేసేవారు. నిలబడి చూపించా. నన్ను పార్ట్ టైం లీడర్ అన్నారు. ఫుల్ టైం ఉండి చూపించాను. ప్రత్యర్థులు చేసే ప్రతి కామెంట్ కు నేను ఎలా కౌంటర్ వేయగలను. నిలబడి చూపించాను. సరిపోదా? ప్రతిదానికి స్పందిస్తే ఎలా? ఈ రోజుల్లో మహాత్మాగాంధీ రాజకీయాల్లోకి వచ్చినా కులాలు అంటగడతారు. వైసీపీ రెచ్చగొట్టే చచ్చు వ్యూహాలు చాలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.
ఆవేశంగా మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆచితూచి స్పందించటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఏదైనా నిదానంగా మాట్లాడాలన్నారు. ప్రతిసారీ సంచలనం చేయనని.. కొన్నిసార్లు నిర్మాణాత్మకంగా మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడినట్లుగా అనిపిస్తుందన్నారు. అలా అని ప్రతిదీ సినిమాల్లో మాదిరి ఊగిపోతూ మాట్లాడలేమని.. విశాఖలో జనవాణి నిర్వహించాలని అనుకున్నప్పుడు పోలీసులు వచ్చి ఆపితే.. తాను మాట్లాడని విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో కుటుంబాలు పార్టీ మీద ఆధారపడి ఉన్నప్పుడు భావోద్వేగాల్ని కంట్రోల్ లో ఉంచుకోవాలని వ్యాఖ్యానించారు.