జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు…వాటికి వైసీపీ నేతల నుంచి వస్తున్న స్పందన ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోకుండా పవన్ తన వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాకినాడలో పర్యటించిన పవన్ కల్యాణ్ నగరంలో ముస్లింలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకొని వచ్చానని, తాను మిగతా రాజకీయ నేతల్లా కాదని అన్నారు. ఒక సోదరుడిలా, ఒక మనిషిగా, ఒక భారతీయుడిగా తాను మాట్లాడతానని పవన్ చెప్పారు. అతివాద భావజాలం ఏ మతంలో ఉన్నా అందరం ఖండించాలని అన్నారు. 1947లో జిన్నా నిర్ణయంతో పాకిస్థాన్, భారత్ లు మత ప్రాతిపదికన విడిపోయాయని పవన్ అన్నారు.
నిజంగా భారత్ అంత దుర్మార్గమైనదైతే ప్రస్తుతం దేశంలో 17 శాతం ఉన్న ముస్లింలు మిగతా వారితో కలిసి ఉండలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు దేశ విభజన సందర్భంగా పాకిస్థాన్ నుంచి లక్షలాది మంది హిందువులు పారిపోయారని, చాలామందిని చంపేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో మన దేశంలోని హిందువులు , ముస్లింలు కలిసే ఉన్నారని, అదే భారత్ గొప్పదనమని కొనియాడారు.
కొందరు స్వార్థపూరితమైన రాజకీయ నాయకుల వల్లే సమస్యలు, ఘర్షణలు ఏర్పడుతున్నాయని అన్నారు. నిజంగా మతాన్ని నమ్మేవాళ్లతో ఇబ్బంది లేదని, మతాన్ని రాజకీయం చేసేవాళ్లతోనే ఇబ్బంది అని చెప్పారు. తనకు ముస్లింలు సహోదరుల వంటివారని, తనను నమ్మి తన పార్టీకి అండగా ఉండాలని పవన్ కోరారు. గత ఎన్నికల్లో 3 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ముస్లింలకు కేటాయించానని గుర్తు చేశారు.
రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని, కడపలో మైనారిటీ అమ్మాయిపై అత్యాచారం జరిగితే జనసేన స్పందించింనా డిప్యూటీ సీఎం స్పందించలేదని దుయ్యబట్టారు. మనకు అండగా నిలవని వాడు ముస్లిం అయితే ఏంటి హిందువు అయితే ఏంటి? అంటూ పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.