అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలకు బాగా ఇన్స్ పైర్ అయిన వైసీపీ నేతలు….చెట్టు, పుట్ట, కరెంటు స్తంభం, బోరింగు, ప్రభుత్వ కార్యాలయాలు, చెత్త సేకరించే బండ్లు కావేవీ వైసీపీ రంగులకనర్హం అని జగనన్న జమానాలో నయా కవులుగా మారడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయొద్దు మొర్రో అని కోర్టు మొత్తుకుంటున్నా…వైసీపీ నేతలు మాత్రం…భారతీయులకు జాతీయ జెండా మాదిరిగా తమకు వైసీపీ జెండా అని ఫీలవుతున్న వైనంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా సరే జగన్, వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ రంగుల కల మరోసారి వివాదాస్పదమైంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాల పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలపై జగన్ ఫోటోలు, వైసీపీ రంగులు ముదిరించడం వివాదానికి దారి తీసింది. ఈ నేపద్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. చదువుకునే పిల్లల పుస్తకాలపై నీ బొమ్మలేంటి జగన్ రెడ్డి, ఈ రంగులు ఏంటి అని ఉమా మండిపడ్డారు. టీడీపీ హయాంలో విద్యా ప్రమాణాల్లో ఏపీ మూడో స్థానంలో ఉండేదని, అటువంటి రాష్ట్రాన్ని19వ స్థానానికి నెట్టిన ఘనత జగన్ దేనని దుయ్యబట్టారు.
ఇక బొత్స సత్యనారాయణ విద్యా శాఖా మంత్రి అంటే జనం నవ్వుకుంటున్నారని, ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఇవ్వకుండా రెండు లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును జగన్ నాశనం చేశారని నిప్పులు చెరిగారు. విద్యా కిట్లలో కమిషన్ల కోసం కక్కుర్తి పడిన జగన్ ఏదో కార్యక్రమం పెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మూర్ఖపు నిర్ణయాల వల్ల మూడు నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడం మానేశారని ఉమా మండిపడ్డారు.