సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. వివేకాను పలు దఫాలు విచారణ జరిపిన సీబీఐ…మరింత సమాచారం రాబట్టేందుకు కస్టోడియల్ విచారణ చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా…చివరకు ఆ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.
అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్య కారణాల రీత్యా ఈ నెల 31వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తాజాగా నేడు తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే, అవినాష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ షరతులేమిటి అన్న విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
అవినాష్ కు బెయిల్ లభించడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో సునీత కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు…అవినాష్ కు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆయనకు బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశమైంది.